- రెండో టెస్ట్‌లో యువభారత్ ఘనవిజయం
- 336 పరుగుల భారీ తేడా
- ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కిదే తొలి గెలుపు
భారత్ ఎడ్జ్‌బాస్టన్(Edgebaston)లో ఇప్పటివరకు 8 మ్యాచులాడగా, ఏడింటిలో ఓడిపోయి, ఒకటి డ్రా చేసుకుంది. ఇది తొమ్మిదో మ్యాచ్. ఎట్టకేలకు 58 ఏళ్ల తర్వాత ఈ వేదికపై తొలివిజయాన్ని నమోదు చేసి భారత్ యువరక్తం చరిత్ర సృష్టించింది. ఆకాశ్‌దీప్(Akashdeep) 10 వికెట్ల ప్రదర్శన చేసి, ఇంగ్లండ్‌లో ఈ అరుదైన ఫీట్ చేసిన రెండో బౌలర్‌గా చరిత్ర లిఖించాడు. అంతకుముందు చేతన్‌శర్మ 1986లో బర్మింగ్హమ్లో పది వికెట్లు తీసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు అది ఎంత తెలివితక్కువ నిర్ణయమో తెలిసొచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ యువ సారథి శుభ్‌మన్ గిల్(Shubman Gill) డబుల్ సెంచరీలో చెలరేగగా, జడేజా, యశస్వి సహకారంతో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది. హైదరాబాదీ సిరాజ్(Siraj Ahmed) 6 వికెట్లతో రెచ్చిపోయాడు. ప్రతిగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేసి భారత్‌కు 180 పరుగుల ఆధిక్యతను అందించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్ 6 వికెట్లకు 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసి 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆఖరి రోజైన నేడు ఇంగ్లండ్ 271 పరుగులకు ఆలౌట్ అయి, 336 పరుగల భారీ తేడాతో అపజయం పాలైంది. భారత బౌలర్ ఆకాశ్‌దీప్ ఈసారి 6 వికెట్ల బాధ్యత తను తీసుకున్నాడు.