T20 WORLD CUP 2024 | 13 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచకప్​ను ముద్దాడిన భారత్​

ఉద్వేగపు క్షణం.. ఆఖరి ఓవర్​ అయిదో బాల్​కు రబాడను కళ్లుచెదిరే క్యాచ్​తో సూర్యకుమార్​ పెవిలియన్​కు పంపిన క్షణం. ప్రపంచకప్​ ఖరారు చేసిన ఆ బంతిని వేసిన హార్థిక్​ కళ్లవెంట ధారాపాతంగా కన్నీళ్లు. కారుతున్న కన్నీళ్లతోనే ఆరో బాల్​ సంధించిన క్షణం. మరుక్షణం హోరెత్తిన జనం. అక్కడే కన్నీళ్లతో కూలబడ్డ పాండ్యా. ఆనందబాష్పాలతో నేలను తడుతూ, ముద్దాడిన కెప్టెన్​ రోహిత్​. కోహ్లీకి ఆగని ఆనందబాష్పాలు. జట్టు సభ్యుల ఆనంద బాష్పాల నడుమ ఆకాశం కూడా ఆనందంతో వర్షించింది. కోహ్లీ ఇదే తన ఆఖరి ప్రపంచకప్​ అని ఉద్వేగంతో ప్రకటించిన వేళ.. భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ సగర్వంగా కప్పునెత్తుకున్నాడు.

  • Publish Date - June 30, 2024 / 01:04 AM IST

భారత్​ చేసి చూపించింది. స్వేదేశంలోనే పులులన్న మాటను తుడిచిపెడుతూ ఓటమన్నదే లేకుండా 2024 టి20 ప్రపంచకప్​ను ముద్దాడింది(India win).  ముందుగా బ్యాటింగ్​ చేసి 176 పరుగులు చేసిన భారత్​, తర్వాత దక్షిణాఫ్రికాను 169 పరుగుల వద్దే కట్టడి చేసి సగర్వంగా కప్​ను గెల్చుకుంది. యావద్భారతదేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా విరాట్​ కోహ్లీ(76 పరుగులు), మ్యాన్​ ఆఫ్ ది సిరీస్​గా జస్​ప్రీత్​ బుమ్రా(15 వికెట్లు) ఎంపికయ్యారు.

ప్రపంచకప్​ ఫైనల్లో భారత్​ టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది. ఈసారి సీన్​ రివర్సయింది. ముందుగా రోహిత్​ శర్మ(9) పరుగులకు అవుటవగా, వన్​డౌన్​లో వచ్చిన పంత్​(0) కూడా అదే స్కోరు వద్ద అవుటయ్యాడు. 23 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్​కు మరో గట్టి దెబ్బ తగిలింది. ఫామ్​లో ఉన్న సూర్యకుమార్​ యాదవ్​(3) కూడా అవుటవడంతో భారత్​ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి గొంతువరకు మునిగిపోయింది. ఈ దశలో నిబ్బరంగా ఆడుతున్న కోహ్లీకి అక్షర్​ పటేల్​ జత కలిసాడు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరును పరుగులెత్తించారు. ముఖ్యంగా కోహ్లీ యేధేచ్చగా షాట్లు కొడుతూ, రన్​రేట్ తగ్గకుండా చూసాడు. మరోవైపు అక్షర్​ కూడా సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతూ ప్రొటీస్​ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఇద్దరూ 4 వికెట్​కు విలువైన 72 పరుగులు జోడించిన తర్వాత అక్షర్​(31 బంతుల్లో 47 పరుగులు: ఒక ఫోర్​, 4 సిక్స్​లు) అవుటయ్యాడు.

ఆ తర్వాత కూడా కోహ్లీ దూకుడు కొనసాగించాడు. దూబేతో కలిసి మళ్లీ ఇన్నింగ్స్​ను గాడిలో పెట్టాడు. విరిద్దరూ కూడా మరో అర్థసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి, మంచి ఫైటింగ్​ స్కోరు అయ్యేలా దోహదపడ్డారు. ఫైనల్​ మ్యాచ్​లో విరాట్​ ఫామ్​ను అందుకుని భారత్​ను ఆదుకున్నాడు. చివరికి స్కోరు పెంచే క్రమంలో కోహ్లీ (59 బంతుల్లో 76 పరుగులు: 6 ఫోర్లు, 2 సిక్స్​లు)అవుటయ్యాడు. దూబే 27 పరుగులు చేసి పెవిలియన్​ చేరగా, తుదకు నిర్జీత 20 ఓవర్లలో భారత్​ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. India 176/7.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్​ మహరాజ్ , నోకియా​ చెరో 2 వికెట్లు తీసుకోగా, జాన్సన్​, రబాడ తలా ఒకటి తీసుకున్నారు.

దక్షిణాఫ్రికా 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్లు హెండ్రింక్స్​​, డికాక్​లు మొదటి ఓవర్​ కాపాడుకోగా, రెండో ఓవర్​ వేసిన బుమ్రా, హెండ్రింక్స్​(4)ను బౌల్డ్​ చేసి పెవిలియన్​కు పంపాడు. వెంటనే రెండో వికెట్​గా కెప్టెన్​ మార్క్​రమ్​(4) అర్షదీప్​కు బలయ్యాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ప్రొటీస్​ను ట్రబ్స్​, ఓపెనర్​ డికాక్​ ఆదుకున్నారు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరును పెంచారు. 58 పరుగుల భాగస్వామ్యం తర్వాత స్టబ్స్​(31)ను అక్షర్​ క్లీన్​ బౌల్డ్​ చేసి ఈ జంటను విడదీసాడు. మరో 36 పరుగుల తర్వాత క్వింటన్​ డికాక్​ (39)అర్షదీప్​ బౌలింగ్​లో కుల్​దీప్​కు చిక్కి డగౌట్​కు చేరాడు. 5వ బ్యాటర్​గా వచ్చిన హెన్రిచ్​ క్లాసెన్​ (Henrich Klaasen) సిక్స్​లు బాదుతూ కావాల్సిన రన్​రేట్​ను తగ్గించే ప్రయత్నం చేసాడు. అతనికి జత కలిసిన డేవిడ్​ మిల్లర్​ కూడా ఇతోధికంగా సాయపడ్డాడు. కానీ, క్లాసెన్​ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దాదాపు తన జట్టును గెలిపించినంత పనిచేసాడు.  అతనున్నంతసేపు భారత శిబిరంలో ఆశలన్నీ ఆవిరయ్యాయి. క్లాసెన్​(27 బంతుల్లో 52 పరుగులు: 3 ఫోర్లు, 5 సిక్స్​లు)ను పాండ్యా  అద్భుతమైన బంతితో పెవిలియన్​ చేర్చినా, అప్పటికీ మ్యాచ్​ ప్రొటీస్​ వైపే మొగ్గిఉంది.

మరో 26 పరుగులు కావాల్సిన తరుణమది. ఉన్న బంతులు 23. క్రీజ్​లో మార్కో జాన్సన్​, మిల్లర్​. చాలు కదా అనుకున్నారు ఆఫ్రికన్లు. కానీ, అక్కన్నుంచే అద్భుతం ప్రారంభమైంది. తమలో ఒత్తిడి పెరిగిందని వారికి అర్ధమైంది. 18వ ఓవర్​ వేసిన బుమ్రా మ్యాజిక్,​ జాన్సన్(2)​కు ఇంటికి పంపింది. ఇక లక్ష్యం పెద్దదవుతూ, ఒత్తిడి ఇంకా పెరుగుతూ వచ్చింది. ఉన్నది ఒక్క మిల్లర్​ మాత్రమే. కెప్టెన్​ రోహిత్​ ఆఖరి ఓవర్​ను హార్థిక్​ పాండ్యాకు అప్పగించాడు. మొట్టమొదటి బంతికే సిక్స్​ కొడదామనుకున్న మిల్లర్​(21)ను బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్​తో సూర్యకుమార్​ యాదవ్​ అవుట్​ చేసాడు. దాంతో విజయం దాదాపు ఖరారైపోయింది. రెండో బాల్​ను రబాడ ఫోర్​ బాదగా, రెండవ, మూడవ బంతులకు సింగిల్స్​ బై రూపంలో వచ్చాయి.  సమీకరణం రెండు బంతులు పది పరుగులుగా మారింది. అయిదవ బంతి వైడ్​, ఇంకా 9 పరుగులు, 2 బంతులు. అదనపు బంతికి రబాడ(4) అవుట్​. అంతే… మిగిలిన ఒక బంతికి 9 పరుగులు కావాలి. దాంతో విజయం ఖరారు కాగా, ఆనందబాష్పాలు ధారాపాతంగా కారుతుండగా, పాండ్యా చివరి బంతిని వదిలాడు. ఒక్క పరుగుతో దక్షిణాఫ్రికా పోరాటం ముగిసింది. కప్​ భారత్​ వశమయింది. దేశమంతా సంబరాలు మొదలయ్యాయి.

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జట్టును అభినందిస్తూ ఎక్స్​లో విడియో సందేశం పోస్ట్​ చేసారు. దేశ ప్రజలందరి తరపునా జట్టుకు అభినందనలు తెలియజేసారు.

Latest News