India|ఊహించిందే జరిగింది. రెండో టెస్ట్‌లోను న్యూజిలాండ్(New Zealand) జట్టు గెలిచి చరిత్ర సృష్టించింది. భారత్ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి సొంతగడ్డపై అత్యంత చెత్త ప్రదర్శనతో పర్యాటక జట్టు ముందు అవమానకరంగా తలొంచింది. పుణె వేదికగా శనివారం ముగిసిన రెండో టెస్టులో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోయిన టీమిండియా 113 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని చవి చూసింది. 359 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. మరోసారి శాంట్నర్ ఐదు వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచాడు.
మరో టెస్ట్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ జట్టు టెస్ట్ సిరీస్ గెలుచుకుంది.. అంతేకాదు భారత్ గడ్డపై 69 ఏళ్ల టెస్టు సిరీస్ కలని నెరవేర్చుకుంది. 1955-56 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ ఇలా టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. టీమిండియా బ్యాటర్ల వైఫల్యం ఓటమికి కారణం కాగా, ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Virat Kohli) పేలవ బ్యాటింగ్ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (77: 65 బంతుల్లో 9×4, 3×6) ఒక ఎండ్‌లో నిలకడగా ఆడినా.. అతనికి సపోర్ట్ ఇచ్చేవారు టీమ్‌లో కరువు కావడంతో చేతులెత్తక తప్పలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (8), శుభమన్ గిల్ (23), విరాట్ కోహ్లీ (17)తో పాటు రిషబ్ పంత్ (0) తక్కువ స్కోరుకే ఔటైపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే, న్యూజిలాండ్ సిరీస్‌లో కూడా టీమ్ ఇండియా మెరుగ్గా రాణించాల్సి ఉంది. కానీ, అది జరగలేదు.రెండు టెస్ట్‌లు వరుసగా పరాజయం చెందడంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరుకోవడం కష్టంగానే మారింది. ఇంతకముందు భారత్ 8 మ్యాచ్‌లలో 12 విజయాలతో WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాయింట్ల శాతం 68.06గా ఉంది. పుణెలో భారత్ ఓటమి కారణంగా పాయింట్ల శాతం 62 ఉంది. ఇటువంటి పరిస్థితిలో మిగిలిన 6 టెస్ట్‌లలో కనీసం 4 మ్యాచ్‌లను గెలవవలసి ఉంటుంది. అప్పుడే భారత ఏ ఇతర జట్టుపై ఆధారపడకుండా WTC ఫైనల్‌కు చేరుకోగలదు. ఇది జరగకపోతే భారత్ ఇతర జట్లపై ఆధారపడక తప్పదు. అలాగే దక్షిణాఫ్రికా(South Africa) తన మిగిలిన అన్ని టెస్టుల్లోనూ విజయం సాధించకూడదని ఎదురుచూడాల్సి ఉంటుంది.