- 50 కిలోలకంటే 100 గ్రాములు అధిక బరువు
- నిబంధనల మేరకు అనర్హత వేటు
- మంగళవారం రాత్రి 2 కిలోల అదనపు బరువు
- రాత్రంతా వ్యాయామాలతోనే గడిపిన వినేశ్
- అయినా.. ఉదయానికి స్వల్ప తేడాతో నిరాశ
పారిస్: యావత్ దేశ ఒలింపిక్ స్వర్ణ ఆకాంక్షను ఒక వందగ్రాముల బరువు విచ్ఛిన్నం చేసింది. స్వర్ణ పతకం కోసం జరగాల్సిన పోటీకి సిద్ధమవుతున్న వేళ.. భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ శరీరంలోని వంద గ్రాముల బరువు.. ఆమెను పోటీకి అనర్హురాలిని చేసింది. ఆ వందగ్రాముల బరువు కూడా తగ్గేందుకు కొంత సమయం ఇవ్వాలని భారత ఒలింపిక్ అధికారులు చేసిన విజ్ఞాపనలు ఫలించలేదు. దీంతో వినేశ్ ఫొగట్ ఒలింపిక్ ఆశలు అడియాసలయ్యాయి. ‘ఆమె బుధవారం ఉదయం 100 గ్రాములు బరువు అధికంగా ఉన్నది. ఇందుకు నిబంధనలు ఒప్పుకోవు. ఆమెను డిస్‌క్వాలిఫై చేశారు’ అని ఇండియన్ కోచ్ తెలిపారు. ఈ వార్తను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ధృవీకరించింది. ‘రాత్రంతా జట్టు మొత్తం కృషి చేసినా.. ఆమె ఉదయానికి కొంత అధికంగా బరువు ఉన్నట్టు తేలింది’ అని పేర్కొన్నది. వినేశ్ ఫొగట్ ఆంతరంగిక అంశానికి గౌరవం ఇవ్వాలని అందరికీ విజ్ఞప్తి చేసింది.
కనీసం రజత పతకం అయినా వచ్చే అవకాశాలు ఉన్నా.. అనర్హత వేటు నేపథ్యంలో ఆమె ఖాళీ చేతులతో తిరిగిరావాల్సి వస్తున్నది. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ యూయీ సుసాకిని మట్టికరిపించి చరిత్ర సృష్టించిన సమయంలో కూడా ఆమె తగిన బరువుతోనే ఉంది. అనంతరం వినేశ్ ఫొగట్ 2 కిలోలు అదనపు బరువుతో ఉంది. తన బరువు తగ్గించుకోవడం కోసం వినేశ్ ఫొగట్ మంగళవారం రాత్రంతా వ్యాయామం చేస్తూనే ఉన్నదని, నిద్రకూడా పోలేదని తెలుస్తున్నది. ఆఖరు నిమిషంలో బరువు తగ్గేందుకు జాగింగ్, స్కిప్పింగ్, సైకిలింగ్ వంటి బరువు తగ్గించుకునే కసరత్తులు చేసింది. ఆఖరుకు ఆమె జట్టును కూడా కత్తిరించారు. కానీ.. ఒక్క వందగ్రాముల బరువు ఆమె ఆశలను అడియాసలు చేసింది. మహిళా రెజ్లింగ్‌లో ఫైనల్స్ దాకా వెళ్లడం ద్వారా వినేశ్ ఫొగట్ చరిత్ర సృష్టించారు. అందులోనూ ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లోనే డిఫెండింగ్ చాంపియన్, అపజయాలు ఎరుగని సుసాకిని ఓడించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వినేశ్ సాధారణ బరువు 56 నుంచి 57 కేజీలు ఉంటుంది. అయితే ఇన్విటేషనల్ టోర్నమెంట్లలో 50 కిలోల విభాగంలో రెండు కేజీల వరకూ రిలాక్సేషన్ ఇస్తారు. కానీ.. ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడల వంటి మాత్రం ఈ మినహాయింపు ఉండదు.
బుధవారం ఉదయం ఆమె తీవ్ర డీహైడ్రేషన్‌తో ఒలిపిక్ విలేజ్‌లోని వైద్యశాలలో చేరింది. ‘నేను కొద్దిసేపటి క్రితమే ఫొగట్‌ను ఒలిపిక్ విలేజ్‌లోని వైద్యశాలలో కలిశాను. ఇండియన్ ఒలింపిక్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం, యావత్ దేశం తరఫున పూర్తి మద్దతు ప్రకటించాను. ఆమెకు అవసరమైన వైద్య, నైతిక మద్దతును అందిస్తున్నాం’ అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష తెలిపారు. అనర్హత నిర్ణయంపై పునరాలోచించాలని యూడబ్ల్యూడబ్ల్యూను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోరింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం’ అని ఉష వెల్లడించారు. ఒకవైపు ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. సెమీఫైనల్స్‌లో వినేశ్ చేతిలో ఓడిపోయిన క్యూబా రెజ్లర్ యుస్నెయిలిస్ గుజమాన్ లోపెజ్‌ను ఫైనల్స్‌కు పోటీదారుగా ప్రకటించేశారు. ఇక కాంస్య పతకం కోసం యూయీ సుసాకి, ఒక్సానా లివాచ్ మధ్య పోరు సాగనుంది.