cricket stadium in forest | సాధారణంగా స్టేడియాలు ఏ నగర ప్రాంతాల్లోనో ఒక మోస్తరు పట్టణ ప్రాంతాల్లోనో కనిపిస్తూ ఉంటాయి. కానీ.. ఈ స్టేడియం మాత్రం చుట్టూ దట్టమైన అడవుల్లో దాగి ఉన్నట్టు ఉంటుంది. దీంతో ఈ స్టేడియం ఎక్కడిదనే చర్చను ఈ వైరల్ వీడియో చూసినవారు సందేహాలు లేవనెత్తుతున్నారు. అచ్చం అమెజాన్ అడవుల్లో ఉన్నట్టుందని కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలో చుట్టూ కిలోమీటర్ల కొద్దీ పరుచుకున్న పచ్చదనం, కొండలు, గుట్టలతో కూడి దట్టమైన అటవీ ప్రాంతం కనిపిస్తుంది. మధ్యలో ఓ చిన్న క్రికెట్ మైదానం. ఆ మైదానం ఉన్న ప్రాంతం చూసిన వారెవరికైనా అది ఏ దేశంలో ఉందన్న ఆసక్తి సహజంగానే ఏర్పడుతుంది. కచ్చితంగా ఆ మైదానం అమెజాన్ రెయిన్ ఫారెస్టు ప్రాంతంలో ఉందనుకోవడం ఖాయం. అయితే అంతటి కీకారారణ్యాన్ని తలపించేలా ఉన్న అడవి మధ్యన ఓ వృత్తాకార స్థలంలో ఉన్న ఈ మైదాన ప్రాంతం.. ఇండియాలోనే ఉందన్న సంగతి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. అది కూడా కేరళ రాష్ట్రంలో కావడం విశేషం.
కేరళ రాష్ఱ్రంలో భారీ పచ్చదనంతో కూడిన అడవి మధ్య ఉన్న ఈ క్రికెట్ మైదానం ఓ పల్లెటూరు ప్రాంతంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. వీడియోలో మైదానంలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతూ కనిపిస్తున్నారు. మైదానం చుట్టూ భారీగా విస్తరించిన అటవీ ప్రాంతం.. గుట్టలు.. మధ్యలో తరచి చూస్తే సన్నని మట్టి దారులు తప్ప ఇంకేమీ కనిపించినంతగా పచ్చదనం విస్తరించింది. అందుకే ఈ వీడియోను మొదట్లో చూసిన వారంతా అది రెయిన్ ఫారెస్టు అమెజాన్ ప్రాంతమే అని అనుకుంటూ.. చివరకు వచ్చే సరికి కేరళలోని ప్రాంతంగా తెలుసుకుని విస్మయానికి లోనవుతున్నారు. సముద్ర తీర రాష్ఱ్రంగా ఉన్న కేరళ కూడా అమెజాన్ రెయిన్ ఫారెస్టును తలపిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
దీనిపై మరింత శోధించగా.. అది వంద ఎకరాల్లో ఉన్న భారీ రబ్బర్ చెట్ల ఎస్టేట్ మధ్యలోనిదని తేలింది. వరందరప్పిళైలోని హారిసన్ మలయాళం ప్లాంటేషన్‌లో ఈ చెట్లు భాగం. దీని యజమాని.. ఈ ఎస్టేట్‌లో పనిచేసే కార్మికులు, సిబ్బంది సేదదీరడానికి చతురస్రాకారంలో ఈ భారీ ఆటస్థలాన్ని ఏర్పాటు చేశారు. రానురాను ఇక్కడ క్రికెట్ ఆడటం మొదలవడంతో పిచ్.. రూపుదిద్దుకున్నది. మీరు ఆ వీడియోను బాగా గమనించినట్టయితే.. రబ్బర్ చెట్లకు మైదానానికి మధ్యలో భారీ గుల్‌మొహర్ చట్లు కనిపిస్తాయి. సమీప ఎస్టేట్‌లో కూడా ఇటువంటి ఆట స్థలమే ఉండేదట. అయితే.. దానిని మూసివేయడంతో ఇది మాత్రం మిగిలింది.. చుట్టుపక్కల వారికి ఆనందాన్ని పంచుతున్నది.
Cricket Ground in Kerala ❤️ pic.twitter.com/YIE906y3po
— Gabbar (@Gabbar0099) May 18, 2025