హైదరాబాద్: ఎం సునీల్‌కుమార్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ.. భూమి సునీల్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు ఉండరంటే ఆశ్చర్యం లేదు. అడ్వొకేట్‌గా, ప్రత్యేకించి భూమి చట్టాల నిపుణుడిగా ఆయన పేరుపొందారు. లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్)కు ఆయన అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. సాధన అకాడమీ ఆఫ్ ఇంపరేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్ (సెయిల్స్) డైరెక్టర్‌గా, గ్రామీణ న్యాయ సంస్థ అయిన ల్యాండ్ అండ్ అగ్రికల్చరల్ లాస్ ప్రాక్టీషనర్స్ (లాప్) వ్యవస్థాపకుడిగా, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా అనుబంధ ప్రొఫెసర్‌గా, గ్రామీణ న్యాయ పీఠం సభ్యుడిగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ సభ్యుడిగా బహుళ పాత్రలు పోషిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి భూమి సునీల్.
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రైతులు, గ్రామీణ పేదల కోసం భూమి చట్టాల నిపుణుడిగా ఇతోధికంగా కృషి చేస్తున్నారు భూమి సునీల్. 2004లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పొందిన సునీల్.. తెలంగాణ బార్ కౌన్సిల్‌లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకున్నారు. 2004 నుంచి 2008 వరకు గ్రామీణాభివృద్ధి శాఖలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) రాష్ట్ర లీగల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వినూత్నమైన, మొదటిసారి చేపట్టిన కమ్యూనిటీ పారా లీగల్ కార్యక్రమంతో పది లక్షలకు పైగా పేద కుటుంబాలు భూమిపై హక్కులు పొందడంలో సెర్ప్ లీగల్ కోఆర్డినేటర్‌గా ఆయన కీలక పాత్ర పోషించారు.
గ్రామీణాభివృద్ధి సంస్థ (ఆర్‌డీఐ)లో 2008 నుంచి 2017 వరకూ దాదాపు తొమ్మిదేళ్లు భూమి చట్టాలు, విధానాల రాష్ట్ర డైరెక్టర్‌గా, తదుపరి జాతీయ డైరెక్టర్‌గా పనిచేసిన భూమి సునీల్.. భూమి చట్టాల రచన, న్యాయపరంగా ప్రజల్లో చైతన్యం కల్పించడం, వివిధ రంగాల స్టేక్ హోల్డర్స్‌కు శిక్షణ ఇవ్వడం, పలు భూమి విషయంలో పలు వినూత్న చర్యలు చేపట్టడం ద్వారా గ్రామీణ భారత దేశానికి ఎనలేని సేవలు అందించారు. భూమి హక్కులపై హెచ్‌ఎంటీవీలో 2012 నుంచి 2013 వరకు టెలివిజన్ లైవ్ షోలో ‘భూమికోసం’ పేరిట నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం, 2019 నుంచి ప్రతివారం నిర్వహిస్తున్న ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమాలు ప్రజల్లో బాగా పాపులర్ అయ్యాయి.
1999 నుంచి 2004 వరకు నల్సార్‌లో న్యాయ విద్యార్థిగా సునీల్.. ‘శ్రేయ’ అనే విద్యార్థుల గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి.. గ్రామీణ పేదలకు ఉచితంగా న్యాయ సర్వీసులు అందించేవారు. గ్రామ కోర్టులనే వినూత్న కాన్సెప్ట్‌తో ఈ గ్రూపు నాలుగు గ్రామాలు భూమి వివాదాలు లేని గ్రామాలుగా మారడంలో కీలక పాత్ర పోషించాయి. సెర్ప్ కార్యక్రమం అయిన కమ్యూనిటీ పారాలీగల్ వ్యవస్థకు ఈ గ్రూప్ పునాది వేసింది. ఆయన కృషితో స్ఫూర్తి పొందిన వివిధ న్యాయ కళాశాలలకు చెందిన వందల మంది న్యాయ విద్యార్థులు భూమి హక్కుల విషయంలో పేదలు, గిరిజనులకు ఉచితంగా లీగల్ సర్వీసులు అందించడంలో భాగస్వాములయ్యారు. భూములను లీజుకు ఇచ్చే విషయంలో వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భూమి కమిటీలకు, కేంద్ర ప్రభుత్వ నీతిఆయోగ్ ల్యాండ్ టాస్క్ ఫోర్స్ నిపుణుల కమిటీకి ఆయన సహకారం అందించారు.
హైదరాబాద్‌లోని తన ‘ల్యాండ్ లాయర్స్ చాంబర్స్’ ద్వారా న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేస్తున్న భూమి సునీల్.. ‘ల్యాండ్ అండ్ అగ్రికల్చరల్ లా ప్రాక్టీషనర్స్ (లాప్) అనే గ్రామీణ న్యాయ సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. దీనికి హైదరాబాద్‌తోపాటు వరంగల్, గుంటూరులో కూడా కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందిస్తున్నారు.
సాధన అకాడమి ఆఫ్ ఇంపరేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్‌ను ఏర్పాటు చేసి.. న్యాయపరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నారు. లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) సంస్థను ప్రారంభించిన భూమి సునీల్.. రైతులకు ఉచితంగా న్యాయ సర్వీసులు అందిస్తున్నారు. తెలంగాణలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏర్పాటులో లీఫ్స్ కీలక పాత్ర పోషించింది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్‌గా వివిధ శిక్షణ, అకడమిక్ సంస్థలకు సునీల్ రిసోర్స్ పర్సన్‌గా ఉన్నారు.
వ్యవసాయ చట్టాలు, గ్రామీణ చట్టాలపై ఆయన టీశాట్ టీవీలో 90 వారాలపాలు మాట్లాడారు. టీశాట్‌లో లైవ్ ఇన్ కార్యక్రమాల ద్వారా ప్రతివారం భూమి వ్యవహారాలపై రైతులకు సలహాలు ఇస్తుంటారు. ఈనాడు దినపత్రిక, తెలంగాణ రెవెన్యూ మాసపత్రికకు వ్యాసాలు రాస్తుంటారు. ‘భూమికోసం’, ‘సాగున్యాయం’ యూట్యూబ్ చానళ్ల ద్వారా విజ్ఞానాన్ని పంచేందుకు కృషి చేస్తున్నారు.
గత రెండు దశాబ్దాలుగా భూమి చట్టాలు, వ్యవసాయ చట్టాలు, న్యాయం, చట్టం, ప్రభుత్వ పాలసీల ద్వారా చేసిన కృషితో విశేషానుభవం గడించారు. ఆయనొక లాయర్. డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్. న్యాయ ఉపాధ్యాయుడు.. రచయిత. భూమి, వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఏదైనా తెలుసుకోవాలంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు.. భూమి సునీల్.