GHMC | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( Greater Hyderabad Municipal Corporation Hyderabad ) పరిధి మరింత విస్తరించింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ( GHMC )లో 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్‌లను విలీనం చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విలీన ప్రక్రియ 2025 డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకునే బాధ్యతను డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది.
గవర్నర్ ఆమోద ముద్ర
జీహెచ్ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్‌లకు డిసెంబర్ 1న తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల చట్టాల సవరణ ఆర్డినెన్సులకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆయా ఆర్డినెన్సులకు జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
1955లో ఎంసీహెచ్ ఏర్పాటు
1955కు పూర్వం హైదరాబాద్( Hyderabad ), సికింద్రాబాద్( Secunderabad ) జంట నగరాలుగా ఉండేవి. ఈ రెండు మున్సిపాలిటీలు కూడా వేర్వేరు. అయితే 1955లో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలను విలీనం చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్( Municipal Corporation of Hyderabad ) ను ఏర్పాటు చేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఉప్పల్, ఎల్‌బీనగర్, గడ్డి అన్నారం, మల్కాజ్‌గిరి, కాప్రా, అల్వాల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ మున్సిపాలిటీలను, మెదక్ జిల్లా పరిధిలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం మున్సిపాలిటీలతో పాటు పలు గ్రామాలను ఎంసీహెచ్( MCH )లో విలీనం చేశారు.
జీహెచ్ఎంసీ పురుడు పోసుకుంది ఇలా..
అలా విలీనం చేసి 2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. విలీన ప్రకటన విడుదలవగానే ఎంసీహెచ్( MCH ) అధికారులు ఆయా మున్సిపాలిటీల్లోని ఇంజినీరింగ్ పనులు, నిధులకు సంబంధించిన రికార్డులు, చెక్కులు, ఆస్తి పన్ను దస్త్రాలు, ఇతర పత్రాలు అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. 2 నెలల పాటు ఆయా మున్సిపాలిటీల అధికారులే ఎప్పటిలాగే పౌరులకు సేవలు అందించారు. అప్పటివరకు ఎంసీహెచ్ పరిధికి ఓ కమిషనర్, 7 సర్కిళ్లకు ఏడుగురు ఉప కమిషనర్లు ఉండేవాళ్లు. విలీనం అనంతరం 12 మున్సిపాలిటీలను, 7 సర్కిళ్లను కలిపి 18 సర్కిళ్లుగా కలిపారు. వాటిపై పర్యవేక్షణకు 5 జోన్లు ఏర్పాటు చేశారు. తరువాత జోన్లు ఆరుకు, సర్కిళ్లు 30కి పెరిగాయి. అలా నగర విస్తీర్ణం 172 చదరపు కిలోమీటర్ల నుంచి 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
తాజాగా మరో 27 స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనం..
2007లో ఏర్పాటైన జీహెచ్ఎంసీ( GHMC ) లో తాజాగా 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం అయ్యాయి. దీంతో నగర పరిధి మరింత విస్తరించింది. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సర్కిళ్లుగా పేర్కొని, ప్రస్తుతం ఉన్న 6 జోనల్ ఆఫీస్‌లకు అనుసంధానిస్తారని అన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 30, నూతనంగా చేరే 27 సర్కిళ్లు కలిపి మొత్తం 57 సర్కిళ్లు, 6 జోనల్ కార్యాలయాల కిందే పని చేస్తాయి. 2 నెలల తరువాత జోన్ల సంఖ్యను పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని అధికారులు అంటున్నారు.
