Site icon vidhaatha

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: న్యాయ సలహా తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయం

విధాత, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం పీఏసీలో మంత్రుల కమిటీనీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కలకు ఈ కమిటీలో చోటు దక్కింది. ఆదివారం సాయంత్రం మంత్రుల కమిటీ హైదరాబాద్ లో సమావేశమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయమై ఎలా వెళ్తే న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయనే దానిపై సలహా ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని కోరారు. మరోవైపు ఇదే విషయమై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డితో కూడా ఈ విషయమై చర్చించాలని మంత్రులు నిర్ణయించారు. అదే విధంగా ఢిల్లీలోని ప్రముఖ న్యాయ నిపుణులతో కూడా దీనిపై చర్చించాలని ఈ సమావేశం అభిప్రాయపడింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 30 లోపుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రిజర్వేషన్లపై అసెంబ్లీ చేసి బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఆర్డినెన్స్ కూడా కేంద్రం వద్దే ఉంది. దీంతో రిజర్వేషన్ల అంశంపై ముందుకు వెళ్లాలంటే న్యాయపరంగా ఎలాంటి అవకాశాలున్నాయనే దానిపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తారు. రాష్ట్రాల నుంచి వచ్చిన బిల్లులపై 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల బిల్లులు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి వద్దకు చేరాయి. ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్దే ఈ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకొనేలా ఆదేశించాలని సుప్రీంకోర్టు వెళ్లే యోచన కూడా ప్రభుత్వానికి ఉంది. అయితే ఏ అంశం తమకు కలిసి వస్తోందనే దానిపై న్యాయ నిపుణుల సలహా తీసుకొనుంది ప్రభుత్వం.

Exit mobile version