King Koti Hospital | హైదరాబాద్ : ఐదు కిలోల బరువు కలిగిన శిశువు( Infant )కు సాధారణ ప్రసవం( Normal Delivery ) ద్వారానే జన్మనిచ్చింది ఓ మహిళ. ఈ అరుదైన ఘటన హైదరాబాద్( Hyderabad ) నగరంలోని కింగ్ కోఠి వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రి( King Koti Hospital )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి ఆర్యనగర్‌కు చెందిన సయ్యద్ జునైద్ భార్య నూరెయిన్ సిద్ధిఖ్(23) కు నెలలు నిండడంతో.. ప్రసవం నిమిత్తం కింగ్ కోఠి వైద్య విధాన పరిషత్ జిల్లా ఆస్పత్రిలో బుధవారం రాత్రి చేరారు. అయితే ముందు జాగ్రత్తగా డాక్టర్ జ్యోతిర్మయి ఆధ్వర్యంలోని వైద్య బృందం గర్భిణికి పరీక్షలు నిర్వహించి.. ఆమె కడుపులోని బిడ్డ బరువును అంచనా వేశారు.
నాలుగు కిలోలకు పైగానే శిశువు బరువు ఉంటుందని వైద్య బృందం అంచనాకు వచ్చింది. దీంతో అవసరమైతే సర్జరీ చేయడానికి సిద్ధమవుతూనే.. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యత ఇచ్చారు. డాక్టర్ల నిరంతర పర్యవేఓణలో నూరెయిన్ సిద్ధిఖ్ బుధవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో పండంటి మగబిడ్డకు సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
నూరెయిన్‌కు ఇది మూడో కాన్పు. మొదటి రెండు కాన్పూల్లోనూ ఆమెకు 3.8 కిలోలు, 4.5 కిలోల బరువులతో బిడ్డలు జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు. అసాధారణంగా 5 కిలోల బరువు ఉండడంతో పాటు.. డాక్టర్ల కృషితో సాధారణ ప్రసవంలో జన్మించడం విశేషం. ఇది కింగ్ కోఠి హాస్పిటల్ వైద్యుల ఘనత అని పలువురు ప్రశంసిస్తున్నారు.
