Site icon vidhaatha

Love Story | ట్యాక్సీ డ్రైవ‌ర్ ‘ల‌వ్’ కోసం.. లండ‌న్ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్న‌ ఓ ‘వివాహిత’ క‌థ ఇదీ..

Love Story | ప్రేమ‌( Love )కు హ‌ద్దులు, స‌రిహ‌ద్దులు ఉండ‌వ‌నేది న‌గ్న స‌త్య‌మే అని మ‌రోసారి నిరూపితమైంది. ఎందుకంటే.. ఓ వివాహిత( Married Woman ) విలాసవంత‌మైన జీవితం, బంగారం లాంటి భ‌ర్త‌, ముత్యాల్లాంటి ఇద్ద‌రు పిల్ల‌ల‌ను వ‌దిలేసి.. ట్యాక్సీ డ్రైవ‌ర్ ల‌వ్( Taxi Driver Love ) కోసం.. లండ‌న్‌( London )ను విడిచిపెట్టి హైద‌రాబాద్‌( Hyderabad )కు వ‌చ్చింది. ఈ మ‌ధ్య‌లో ట్యాక్సీ డ్రైవ‌ర్‌తో క‌లిసి గోవా( Goa )లో షికార్లు.. చివ‌ర‌కు త‌న‌ను కిడ్నాప్ చేశారంటూ న‌మ్మ‌బ‌లికి.. మ‌ళ్లీ శంషాబాద్ ఎయిర్‌పోర్టు( Shamshabad Airport )లో త‌న ప్రేమ‌ను వ‌దిలేసి.. లండ‌న్‌లోని భ‌ర్త వ‌ద్ద‌కు సుఖాంతంగా చేరుకున్న‌ ఓ వివాహిత క‌థ ఇదీ.

వివ‌రాల్లోకి వెళ్తే.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని అల్వాల్‌( Alwal )కు చెందిన ఓ జంట‌కు 17 ఏండ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి 13 ఏండ్ల కుమారుడు, 12 ఏండ్ల కుమార్తె ఉంది. ఉద్యోగ రీత్యా భ‌ర్త లండ‌న్‌లో స్థిర‌ప‌డ్డాడు. భార్యాపిల్ల‌లు కూడా లండ‌న్‌లో ఉంటున్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో భార్య త‌ల్లి చ‌నిపోవ‌డంతో.. ఆమె త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. ఇక త‌ల్లి అస్తిక‌ల‌ను గంగాలో క‌లిపేందుకు కాశీకి వెళ్లొచ్చేందుకు ఓ ట్యాక్సీని మాట్లాడుకుంది. ట్యాక్సీ డ్రైవ‌ర్‌కు గూగుల్ పే( Google Pay ) ద్వారా డ‌బ్బులు చెల్లించింది ఆవిడ‌.

ఇక ట్యాక్సీ డ్రైవ‌ర్ ఆమెపై మ‌న‌సు పారేసుకున్నాడు. గూగుల్ పే చేసిన ఫోన్ నంబ‌ర్ ద్వారా ఆమెతో చాటింగ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. చివ‌ర‌కు వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో వ‌చ్చిన మార్పును అత్త గ్ర‌హించింది. దీంతో కొడుకుకు స‌మాచారాన్ని చేర‌వేసింది. చేసేదేమీ లేక భ‌ర్త త‌న భార్యాపిల్ల‌ల‌ను లండ‌న్‌కు పిలిపించుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ ట్యాక్సీ డ్రైవ‌ర్, వివాహిత మ‌ధ్య సంబంధాలు తెగిపోలేదు. ఇద్ద‌రూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు.

అయితే భ‌ర్త త‌ల్లి సెప్టెంబ‌ర్ 15న మృతి చెందింది. దీంతో భార్యాపిల్ల‌ల‌ను లండ‌న్‌లోనే వ‌దిలేసి భ‌ర్త హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఇక సెప్టెంబ‌ర్ 30వ తేదీన లండ‌న్‌లోని ఓ పార్కులో పిల్ల‌ల‌ను వ‌దిలేసి ఆమె కూడా ముంబై మీదుగా హైద‌రాబాద్‌కు చేరుకుంది. గంట‌ల త‌ర‌బ‌డి త‌ల్లి కోసం పిల్ల‌లు ఎదురుచూశారు. ఎంత‌సేప‌టికి త‌ల్లి రాక‌పోవ‌డంతో హైద‌రాబాద్‌లో ఉంటున్న తండ్రికి స‌మాచారం చేర‌వేశారు పిల్ల‌లు. ఆందోళ‌న‌కు గురైన భ‌ర్త‌.. త‌న భార్య‌కు ఫోన్ చేయ‌గా స్పంద‌న లేదు. దీంతో కంగారుప‌డి ఆయ‌న లండ‌న్ వెళ్లి ఆరా తీయ‌, భార్య హైద‌రాబాద్ వెళ్లిన‌ట్లు తేలింది. మ‌రోసారి సెల్‌ఫోన్‌లో సంప్ర‌దించ‌గా ఆమె నంబ‌ర్ క‌లిసింది. ఈ నెల 5న లండ‌న్ రావ‌డానికి టికెట్ తీసుకున్నాన‌ని ఓసారి, ఎయిర్‌పోర్టుకు బ‌య‌ల్దేరాన‌ని మ‌రోసారి, ఓ ట్యాక్సీ డ్రైవ‌ర్ కిడ్నాప్ చేసి శంషాబాద్‌లోని ప్ర‌యివేటు హాస్ట‌ల్‌లో ఉంచాడ‌ని ఇంకోసారి న‌మ్మించింది.

ఆందోళ‌న‌కు గురైన ఆమె భ‌ర్త స్నేహితుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్‌ఫోన్ ట‌వ‌ర్ లొకేష‌న్ ఆధారంగా ఆమె త‌న ప్రియుడితో ఆమ‌న్‌గ‌ల్‌లో ఉన్న‌ట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వివాహిత‌ను లండ‌న్‌కు పంపించారు పోలీసులు. ట్యాక్సీ డ్రైవ‌ర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Exit mobile version