ఏసీబీ వలలో నలుగురు నీటి పారుదల శాఖ అధికారులు

నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఓ ఫైల్ ఆమోదానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేశ్‌లను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు

  • Publish Date - May 31, 2024 / 12:57 PM IST

నాలా పక్కన అపార్ట్‌మెంట్ల పర్మిషన్ల పేరుతో భారీగా అవినీతి

విధాత, హైదరాబాద్‌ : నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు పట్టుబడ్డారు. నాలా పక్కన అపార్ట్‌మెంట్‌కు సంబంధించి పర్మిషన్ కోసం బిల్డర్ వద్ద నుంచి రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖిలేశ్‌లను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే సమయంలో లంచం డిమాండ్ కు సంబంధించి తప్పించుకున్న నార్సింగ్ మండల సర్వేయర్ గణేశ్ పట్టుకోవడంలో అర్ధరాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. సుమారు 4 గంటలు శ్రమించి నలుగురిని అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

నాలా పక్కన అపార్ట్‌మెంట్ పర్మిషన్ కోసం బాధిత బిల్డర్ నుంచి ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖిలేశ్ ముగ్గురూ రూ.2.5 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. అంగీకరించిన బాధితుడు తొలుత రూ.1.5 లక్షలు ముట్టజెప్పారు. ఇంకో రూ. లక్ష ఇవ్వాల్సి ఉంది. దీన్ని గురువారం సాయంత్రం ఈఈ కార్యాలయంలోనే తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈలోపు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారు నిఘా పెట్టారు. నీటిపారుదల శాఖ అధికారులు రాత్రి 8 గంటల సమయంలో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఇదే సమయంలో లంచం తీసుకోవడంలో కీలకపాత్ర పోషించిన సర్వేయర్ గణేశ్ తప్పించుకోగా, అతడి ఆచూకీ కోసం శ్రమించిన ఏసీబీ అధికారులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. నాలా పక్కన ఉన్న అపార్ట్‌మెంట్లకు పర్మిషన్ల కోసం వారు బిల్డర్ వద్ద నుంచి ఈ లంచం డబ్బులు డిమాండ్ చేసినట్లుగా విచారణలో తేలింది. దీంతో ఇప్పటివరకు ఇచ్చిన పర్మిషన్లపై కూడా ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. పర్మిషన్ల పేరుతో ఉన్నతాధికారులు భారీగా లంచాలు తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.

Latest News