టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించాలని గవర్నర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్ తమిళి సైకి జీవన్‌రెడ్డి లేఖ రాశారు.నెల రోజులు గడుస్తున్నా టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు గవర్నర్ ఆమోదించకపోవడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు. ఉద్యోగాల భర్తీలో బీఆరెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, టీఎస్‌పీఎస్సీ బోర్డు అనేక అవకతవకలకు పాల్పడిందన్నారు.
బోర్డు తప్పిదాలను గత ప్రభుత్వం కప్పిపుచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉందన్నారు. చైర్మన్, సభ్యుల రాజీనామాను ఆమోదించకపోవడం వల్ల ఉద్యోగాల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నామన్నారు. వెంటనే వారి రాజీనామాలు ఆమోదించి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వానికి అవకాశం కల్పించాలని కోరారు.