– తూర్పులో ఇద్దరు… పశ్చిమంలో ఒకరు
– మరో ఏడింటిలో అభ్యర్థులు పెండింగ్
– రెండో జాబితా కోసం ఎదురుచూపు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కాంగ్రెస్ మొదటి జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ ఆపార్టీ ఆశావహులను నిరుత్సాహానికి గురిచేసింది. ఆదివారం ప్రకటించిన జాబితాలో అధిష్టానం మూడు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగతా ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల్లో టికెట్ పై ఇంకా అయోమయం కొనసాగుతోంది. తూర్పు జిల్లాలో ఇద్దరు అభ్యర్థులను, పశ్చిమ ప్రాంతం నుండి ఒకరిని ప్రకటించారు.
మంచిర్యాల జిల్లాలో రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో మంచిర్యాల నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బెల్లంపల్లి నియోజకవర్గం నుండి మాజీ మంత్రి గడ్డం వినోద్ పేర్లను ప్రకటించింది. పశ్చిమ ప్రాంతంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావును నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు బలమైన అసమ్మతి వర్గం లేదని చెప్పుకోవాలి. అనుచరులు బాణాసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకున్నారు. వీరిలో ఇద్దరు గత ఎన్నికల్లో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు.
ఊహించినట్లుగానే ప్రకటన
కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గత ఎన్నికల్లో ఐదువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే మాజీ మంత్రి గడ్డం వినోద్ బీఎస్పీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత గడ్డం వినోద్ బీఎస్పీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఐదేళ్లుగా అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. మొదటి నుండి ఈ రెండు సీట్లు ఈ ఇద్దరు అభ్యర్థులకే కేటాయిస్తుందని ఊహించినట్లుగానే అధిష్టానం వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరో అభ్యర్థి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు గతంలో టీఆర్ఎస్ లో కొనసాగుతూ ఇంద్రకరణ్ రెడ్డి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు.
కాంగ్రెస్ పార్టీలోకి శ్రీహరి రావు రాకముందు ఆపార్టీ నాయకునిగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొనసాగారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి కమలం పార్టీలో చేరడంతో, ఇంద్రకరణ్ రెడ్డితో విభేదించిన శ్రీహరి రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆవెంటనే ఆయనకు డీసీసీ పదవి కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ మరో 7 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితాపై ఉత్కంట నెలకొంది. టికెట్ ఆశించే అభ్యర్థుల సంఖ్య పెరగడంతో అగ్ర నాయకులు అందరినీ పిలిపించుకొని చర్చిస్తున్నారు.