Site icon vidhaatha

 ఆ కార‌ణంతో హైద‌రాబాద్‌లో ప్ర‌తి ఏడాది 1500 మ‌ర‌ణాలు..!

హైద‌రాబాద్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో వాతావ‌ర‌ణం మ‌రింత క‌లుషిత‌మవుతోంది. మ‌రి ముఖ్యంగా వాయు కాలుష్యం అధిక‌మ‌వుతోంది. రోజురోజుకు గాలి నాణ్య‌త ప‌డిపోతోంది. వాయు కాలుష్యం కార‌ణంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తి ఏడాది 1500 మంది దాకా మ‌ర‌ణిస్తున్న‌ట్లు ఓ నివేదిక‌లో వెల్ల‌డైంది.

ది లాన్సెట్ ప్లానెట‌రీ హెల్త్ జ‌ర్న‌ల్ ఇటీవ‌ల ఓ అధ్య‌యాన్ని ప్ర‌చురించింది. ఇండియాలోని ప‌ది న‌గ‌రాల్లో వాయు కాలుష్యం కార‌ణంగా ఎన్ని మ‌ర‌ణాలు సంభవిస్తున్నాయ‌నే అంశంపై ఆ నివేదిక‌లో వెల్ల‌డించారు. 2008 నుంచి 2019 మ‌ధ్యకాలంలో సంభ‌వించిన 36 ల‌క్ష‌ల మ‌ర‌ణాల‌ను అధ్య‌యనంలో విశ్లేషించారు. ఒక్క హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తి ఏడాది 5.6 శాతం మ‌ర‌ణాలు న‌మోదైన‌ట్లు పేర్కొన్నారు. అంటే ప్ర‌తి ఏడాది 1567 మంది మ‌ర‌ణిస్తున్న‌ట్లు తేలింది.

అహ్మ‌దాబాద్, బెంగ‌ళూరు, చెన్నై, ఢిల్లీ, హైద‌రాబాద్, కోల్‌క‌తా, ముంబై, పుణె, సిమ్లా, వార‌ణాసి వంటి న‌గ‌రాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక ప‌రిమితుల‌ను మించాయ‌ని నివేదిక వెల్ల‌డించింది. మెషీన్ లెర్నింగ్ సాంకేతిక‌తో రూపొందించిన అత్యాధునిక ప‌ద్ధ‌తుల ద్వారా పీఎం 2.5 రేణువుల స్థాయుల‌ను అంచ‌నా వేశారు.

ఈ కాలుష్య రేణువులు ముక్కులోని వెంట్రుక‌ల‌ను, శ్లేష్మాన్ని సుల‌భంగా దాటి వేసి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తాయి. అనంత‌రం అవి తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తాయి. దీర్ఘ‌కాలికంగా మ‌న‌ల్ని అనారోగ్యానికి గురి చేసి, చివ‌ర‌కు ప్రాణాలు తీస్తాయి. తీవ్రమైన ద‌గ్గు, జ‌లుబు, అస్తామా కార‌ణంగా ఊపిరితిత్తులపై ప్ర‌భావం ప‌డుతుంది. తద్వారా శ్వాస‌లో లోపం ఏర్ప‌డి మ‌ర‌ణానికి దారి తీస్తుంది.

 

 

Exit mobile version