Site icon vidhaatha

అమెరికా వర్సెస్ అందుబాటులో.. పాలకుర్తి ప్రచారంలో ప్రధానాంశం


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో ప్రజాసమస్యలు, పార్టీల మ్యానిఫెస్టో ప్రధానాంశంగా జరుగుతుంటాయని అనుకుంటాం. కానీ, ప్రచారం ప్రారంభమైన తర్వాత ఇవన్నీ పక్కకుపోయి ప్రత్యర్థి పార్టీ, అభ్యర్థిలో తమకు కలిసొచ్చే అంశం ఏది ఉంటే అది కూడా ప్రచారాస్త్రంగా కొనసాగించడం పరిపాటి.


మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తూ మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో ‘అమెరికా వర్సెస్ అందుబాటులో’ అనేదాన్ని ముందుకు తీసుకొచ్చారు. అమెరికా వెళ్ళిపోయే అభ్యర్థి కావాలా? నిత్యం మీకు అందుబాటులో ఉండే అభ్యర్థికావాలా? అంటూ దీనిచుట్టే ప్రచారం సాగుతోంది.


బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఆ పార్టీ నాయకులు దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ అభ్యర్థి మామిండ్ల యశస్వినిరెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఈ వివాదం సాగుతుండగా ఆఖరికి సీఎం కేసీఆర్ మంగళవారం తొర్రూరులో నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ ప్రచారసభలో ప్రసంగిస్తూ ఇదే అంశాన్ని లేవనెత్తడంతో మరింత ప్రాధాన్యత చేకూరింది.


ఇది లాఉండగా డీలిమిటేషన్ కారణంగా గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడుగా మారగా, ఎర్రబెల్లి దయాకర్ రావు 2009లో పాలకుర్తికి వెళ్ళారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా, 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి తన అదృష్టాన్ని నాలుగోసారి పరీక్షించుకుంటున్నారు.


– విమానమెక్కుతారు.. జాగ్రత్త


కేసీఆర్ తొర్రూరు సభలో మాట్లాడుతూ అమెరికా నుంచి విమానంలో వచ్చి ఐదు రోజులు మురిపించటోళ్ళు, రేపు మనకు కిరీటం పెడుతరా? టోపి పెట్టి మళ్ళీ విమానమెక్కుతరంటూ.. కాంగ్రెస్ అభ్యర్థిని యశస్వినిరెడ్డి గురించి విమర్శించారు. ఇలాంటి వ్యక్తులకు కాకుండా మీ కోసం తండ్లాడే వ్యక్తి దయాకర్ రావు.. ఆయనను గెలిపించాలని కోరారు.


– యశస్వినిరెడ్డిపై ఎర్రబెల్లి విమర్శ


పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మామిండ్ల యశస్వినిరెడ్డి పోటీచేస్తున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో తనకు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురులేదని భావించారు. నిజంగానే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎర్రబెల్లికి ప్రత్యర్థులు నియోజకవర్గంలో లేకుండా పోయారు. గత ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేయగా, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి జంగా రాఘవరెడ్డి పోటీచేశారు. ఎర్రబెల్లి విజయం సాధించారు. ఈ ఎన్నికల తర్వాత పాలకుర్తి నియోజకవర్గం నుంచి రాఘవరెడ్డి దృష్టి మళ్ళించారు.


దీంతో తనకు ప్రధాన పార్టీల నుంచి ప్రత్యర్థులు ఎవరూ లేరని భావిస్తున్న సమయంలో, అదే నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి రంగప్రవేశం చేశారు. సరాసరి కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందనే ప్రచారంతో పాలకుర్తిలో అడుగుపెట్టారు. ఎదురులేదని భావించిన ఎర్రబెల్లికి ధీటుగా ప్రచారాన్ని కొనసాగించారు. ఝాన్సీరెడ్డికి టికెట్ ఖాయమనుకుంటున్న సమయంలో ఆమె భారత పౌరసత్వానికి చేసుకున్న దరఖాస్తు ఆమోదం లభించలేదు.


దీంతో ఆమె తన కోడలు యశస్వినిరెడ్డిని రంగంలోకి దించారు. యశస్విని దంపతులు కూడా అమెరికాలో ఉంటున్నందున ఎన్నికల్లో అదె ప్రచారాస్త్రాన్ని ఎర్రబెల్లి ప్రయోగిస్తున్నారు. అయితే దీనికి ప్రతిగా తాను అమెరికా వెళ్ళడం లేదని ఇక్కడే ఉంటానని, మీకు అందుబాటులో ఉంటానంటూ ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఇదేమీ పట్టించుకోకుండా విమర్శలు చేస్తున్నారు.


ఇదిలా ఉండగా తాను లోకల్, తమ అత్తగారిల్లు పాలకుర్తి నియోజకవర్గం, కానీ ఎర్రబెల్లి నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. వర్ధన్నపేటలో అవకాశం లేక పాలకుర్తికి ఎర్రబెల్లి రాజకీయ వలస వచ్చారంటూ విమర్శిస్తున్నారు. పాలకుర్తి ప్రచారంలో ఇదే ప్రధానాంశంగా విమర్శలు, ప్రతివిమర్శలు సాగుతున్నాయి.

Exit mobile version