పోలవరం డ్యామ్ పరిశీలనలో అమెరికా, కెనడా నిపుణులు … నాలుగు రోజుల పాటు పరిశీలన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. నలుగురు సభ్యులు గల నిపుణులు ఆదివారం నుంచి జులై 3 వరకు ప్రాజెక్టుకు చెందిన ప్రతి విభాగాన్ని పరిశీలించనున్నారు

  • Publish Date - June 30, 2024 / 06:22 PM IST

విధాత , హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. నలుగురు సభ్యులు గల నిపుణులు ఆదివారం నుంచి జులై 3 వరకు ప్రాజెక్టుకు చెందిన ప్రతి విభాగాన్ని పరిశీలించనున్నారు. అమెరికాకు చెందిన డేవిడ్‌ పి పాల్‌, గెయిన్‌ ఫ్రాంకో డి సిక్కో, కెనడానుంచి రిచర్డ్‌ డానెల్లీ, సీన్‌ హించ్‌ బెర్గర్ ఆదివారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా డయాఫ్రం వాల్, రెండు కాఫర్‌ డ్యాంలు, గైడ్‌ బండ్‌లను వారు పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎగువ, దిగువ కాపర్‌డ్యాంలు , డయాఫ్ర్ వాల్‌ పనులను ప్రారంభించింది. 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత అవి వరదలకు కొట్టుకుపోయాయి. ఈ పనుల పునరుద్ధరణలో జాప్యం జరగడంతో ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ పోలవరంపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించడంతో పాటు పునరుద్ధరణ పనులు చేపట్టడానికి అమెరికా, కెనడాకు చెందిన సంస్థలతో మాట్లాడి జలవనరుల నిపుణులను రప్పించారు. వారు ఇచ్చే నివేదికల ఆధారంగా పోలవరం ప్రాజెక్టు పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. నిపుణులు నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు డిజైన్లను సమగ్రంగా అధ్యయనంతో పాటు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో, నిర్మాణ సంస్థలతో కలిసి రివ్యూ చేయనున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు.

Latest News