ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యేల కొనుగోలు సెగలు

  • Publish Date - April 4, 2024 / 03:31 PM IST

విధాత: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ప్రత్యేక ఆసక్తికర అంశంగా మారింది. టాస్క్‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును కస్టడీలోకి తీసుకుని విచారించే క్రమంలో ఫౌమ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కుట్ర కోణం వివరాలపై దర్యాప్తు బృందం ప్రశ్నించి కీలక వివరాలు రాబడుతుంది. రాధాకిషన్‌రావు బృందమే అప్పట్లో ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌ను రికార్డింగ్ చేసింది. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అప్పటి బీఆరెస్ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న క్రమంలో గువ్వల బాలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు సంభాషణాలు బయటపడటంతో విషయాన్ని బీఆరెస్ ప్రభుత్వ పెద్దలకు ప్రణీత్‌రావు చేరవేసి అప్రమత్తం చేశారు.

దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అప్పటి టాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్‌రావుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్‌ను బీఆరెస్ సుప్రీం అప్పగించారు. ప్రస్తుత డీఎస్పీ, అప్పటి ఐటీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నటువంటి జూపల్లి రమేశ్‌రావుతో కలిసి రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావుల బృందం నాలుగు రోజులు ముందుగానే మెయినాబాద్ ఫౌమ్‌హౌస్‌కు వెళ్లి సీసీ కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు అమర్చారు. పక్కా ట్రాప్ ఏర్పాట్ల పిదప బీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చర్చలకు నందకిషోర్ బృందంతో చర్చలకు పంపి ఆ సంభాషణలను రికార్డు చేశారు. ఆ తర్వాతా కొనుగోలు భేటీ వ్యవహారాన్ని మొత్తం ముందస్తు పథకం మేరకు రికార్డు చేసి అప్పటి సీఎం కేసీఆర్‌కు అందించినట్లుగా పోలీసులు గుర్తించారు.

పోలీసు అధికారులు అందించిన రికార్డు వీడియోలనే కేసీఆర్ మూడు భాగాలుగా విడుదల చేశారు. బీఆరెస్ పెద్దల టార్గెట్ మేరకు బీఎల్ సంతోష్‌, తుషార్‌లకు నోటీస్‌లు జారీ చేసేందుకు ఏకంగా ఓ బీఆరెస్ నేతకు చెందిన ప్రత్యేక విమానాన్ని వినియోగించుకుని డిల్లీ, కేరళ వెళ్లి వారికి నోటీస్‌లు అందించారు. ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరిగిన ట్యాపింగ్ విచారణను కూడా కొనసాగిస్తూ విమాన యజమానిని కూడా విచారించాలని దర్యాప్తు బృందం నిర్ణయించింది.

2022ఆక్టోబర్‌లో వెలుగుచూసిన ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రాధాకిషన్‌రావు బృందం 74డివైస్‌లు, మైక్రోఫోన్లు, సీసీ టీవీలు, స్పై కెమెరాలను అమర్చినట్లుగా గుర్తించారు. అక్కడ ఏమైనా డబ్బులు దొరికిన వెంటనే వాటిని స్వాహా చేసే ప్రయత్నం కూడా చేశారని దర్యాప్తు బృందం విచారణలో తేలింది. అలాగే ఆరోజు స్టీఫెన్ రవీంద్ర దొరికినట్లుగా చెప్పిన 30కోట్లు ఎటు పోయాయన్న అంశంపై రాధాకిషన్‌రావును విచారించనున్నారు.

రాధాకిషన్‌రావు నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టాలి : వెస్ట్ జోన్ డీసీపీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన రాధాకిషన్ రావు నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టాల్సివుందని వెస్ట్ జోన్ డీసీపీ ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు ప్రముఖుల ప్రొఫైల్స్ అనధికారికంగా తయారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని, ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రొఫైల్స్ తయారు చేశారని విచారణలో గుర్తించామన్నారు.

ట్యాపింగ్‌లతో బెదిరింపులకు పాల్పడి ఓ రాజకీయ పార్టీకి డబ్బులు చేరేలా చేశారని, ఎస్‌ఐబీ హార్డ్ డిస్క్‌ల ధ్వంసం కేసులో రాధాకిషన్‌రావు కుట్ర చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రముఖుల ప్రొఫైల్స్ బయటకు రాకుండా హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేశారని, ప్రణీత్‌రావుకు హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసేందుకు అతను సహకరించాడని డీసీపీ వెల్లడించారు. రాధా కిషన్ రావును ఈనెల 10వరకు కస్టడీ విచారణ చేస్తామన్నారు.

Latest News