- నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
- మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలి
- అధికారులకు బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆదేశాలు
విధాత, జనగామ ప్రతినిధి : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాలు మాత్రమే వడ్డించాలని, మెనూ ప్రకారం ఆహార పదార్థాలను తయారు చేయాలని బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం చంద్రశేఖర రావు అన్నారు. మంగళవారం జనగామ జిల్లాలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. జనగామ జిల్లాలోని మహాత్మ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ తో పాటు బీసీ బాలికల వసతి గృహం, బీసీ బాలుర కళాశాల వసతి గృహం, మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ కళాశాలలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల భోజనం కోసం వినియోగిస్తున్న ఆహార సామాగ్రి నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మెనూ ప్రకారంగా భోజనం వండి విద్యార్థులకు పెట్టాలని నిర్వాహకులకు తెలియజేశారు. వసతి గృహాల పరిసరాలను పరిశీలిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. చక్కగా చదువుకోవాలని.. క్రమశిక్షణలో మెలగాలని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ సిబ్బందిని ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.