Site icon vidhaatha

Maheshwar Reddy | ఉత్తమ్ బెదిరింపులకు భయపడబోను: మహేశ్వర్‌రెడ్డి

పౌరసరఫరాల అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

విధాత: పౌరసరఫరాల శాఖలో వేయికోట్ల స్కామ్ జరిగిందన్న నా ఆరోపణలపై సరైన సమాధానాలు చెప్పకుండా నాపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించ లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. అదే స్పీడ్‌తో పని చేశానని, ఇప్పుడు బీజేపీ శాసనసభా పక్ష నేతగా అదే స్పీడ్‌తో పని చేస్తున్నానన్నారు. పైరవీ చేసి బీజేఎల్పీ పదవి తెచ్చుకున్నానని ఉత్తమ్ నాపై అసత్య విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కాంగ్రెస్ కాదని, అందరి సమన్వయంతో నాకు బీజేపీ ఎల్పీ నేతగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పదవి ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా..? మీలా దిగజారి ఆరోపణలు చేయలేనని, మా పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే సీఎంను కలవడానికి వెళ్లానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపైనే తన పోరాటమని.. ఎవరిపైనో వ్యక్తిగతంగా కాదని తెలిపారు. ఉత్తమ్‌ శాఖలో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే వ్యక్తిగతంగా తీసుకోవద్దని.. ఒకవేళ తాను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే ఉత్తమ్ చాలా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

పౌరసరఫరాల శాఖ అవినీతిపై నేను సీఎం రేవంత్‌రెడ్డికి 19ప్రశ్నలతో లేఖ రాశానని, ఆర్ ట్యాక్స్‌, బీ ట్యాక్స్‌పై స్పందించని ఉత్తమ్‌ ఒక్క యూ ట్యాక్స్‌పై మాత్రం స్పందించిన తీరు చూస్తుంటే ఆ శాఖలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధమవుతుందన్నారు. పౌరసరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సిటింగ్ జడ్జీతో, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. త్వరలోనే ఈ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నారు.

Exit mobile version