- హోరెత్తుతున్న మూడు పార్టీ ల ప్రచారం
- కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ నేతల మాటల యుద్ధం
- ప్రచారంలో కాక రేపిన బీఆరెస్ అధినేత కేసీఆర్
- త్వరలో పాలమూరుకు మోదీ, కేటీఆర్, హరీశ్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: నామినేషన్ల విత్ డ్రా ఘట్టం పూర్తి కావడంతో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం మరింత జోరందుకుంది. మాటల తూటాలు.. విమర్శలు ప్రతి విమర్శలు… అధినేతల మధ్య మాటల యుద్ధం.. వెరసి పార్లమెంట్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పోటీలో ఉండగా ప్రాంతీయ పార్టీ బీఆరెస్ పోటీలో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరుసార్లు ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే పట్టుదలతో ప్రచారాన్ని హోరెత్తించి కాంగ్రెస్ శ్రేణుల్లో నేనున్నా అని రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. అదే ఉత్సహంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో కదం తొక్కుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారంలో నిమగ్నమయ్యారు. తమ నియోజకవర్గంలో అధిక మెజారిటీ తెచ్చి రేవంత్ రెడ్డి వద్ద మంచి మార్కులు కొట్టాలనే దృష్టిలో ఎమ్మెల్యేలు ఎండలు సైతం లెక్కచేయకుండా గ్రామ గ్రామాన ప్రచారంలో దూసుకెళుతున్నారు.
అరుణ టార్గెట్‌గా వంశీచంద్
వంశీచంద్ రెడ్డి తన ప్రచారంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పైనే విమర్శల దాడి చేస్తున్నారు. ఆడబిడ్డకు అండగా నిలవాలని ఓటర్లను వేడుకుంటున్న అరుణ గద్వాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితను ఓడించినప్పుడు ఆడబిడ్డ కనపడలేదా? అని వంశీ ప్రశ్నిస్తున్నారు.ఈ మధ్య ఇదే అంశంపై అరుణను పదే పదే వంశీ టార్గెట్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డకు అన్యాయం చేసిన అరుణకు మహిళల ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శలు చేస్తున్నారు. బీఆరెస్ తమకు పోటీ లేదనే ఉద్దేశంతో బీజేపీ అభ్యర్థి అరుణ పైనే ఎక్కువగా విమర్శల దాడి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ తమ ప్రచారంలో కూడా అరుణనే టార్గెట్ చేసి మాట్లాడారు. పాలమూరు జిల్లా నుంచి కృష్ణా నది నీటికి హారతి పట్టి రాయలసీమకు తాకట్టు పెట్టిన అరుణ అంటూ ఇటీవల పాలమూరులో జరిగిన కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం బీజేపీ అధిష్ఠానం వద్ద నోరుఎత్తని అరుణకు ఓటు వేయవద్దని రేవంత్ రెడ్డి సైతం పిలుపునిచ్చారు.
మోదీ మేనియాపై ఆరుణ ఆశలు
వీరి విమర్శలను అరుణ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రచారం చేస్తున్నారు. అధికంగా ప్రధాని నరేంద్ర మోదీ మేనియాను ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. మోదీ వల్లే దేశానికి భద్రత ఉంటుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఈ ఎన్నికల్లో తనదే గెలుపు అని అరుణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆరెస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పాలమూరులో చేసిన ప్రచారానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి కి ప్రజా బలం పెరిగిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పాలమూరులో కేసీఆర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ మెగా సక్సెస్ కావడంతో బీఆరెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు ఉత్సహంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. ముగ్గురు అభ్యర్థులు ప్రచారం లో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంకా మిగిలి ఉండటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా తయారైందని పలువురు అంటున్నారు. కాంగ్రెస్ హామీల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ, బీఆరెస్ ప్రయత్నిస్తున్నాయి.
ఈ వారం మరింత హాట్‌హాట్‌గా
ఈ వారంలో బీ ఆర్ ఎస్ అభ్యర్థిమన్నె శ్రీనివాస్ రెడ్డి తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రచారం లో పాల్గొననున్నారు. బీజేపీ అభ్యర్థి అరుణ తరపున ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 9 న జిల్లా కు వస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చందు రెడ్డి తరపున సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆరు సార్లు ప్రచారం చేశారు.ఎన్నికలు దగ్గర పడుతుండడం తో జిల్లా లో రాజకీయం వేడెక్కింది.