దమ్ముంటే రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయండి..మంత్రి పొన్నంకు బీజేపీ నేతల సవాల్

గత కొద్దిరోజులుగా బీజేపీపైన, బండి సంజయ్ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రతిస్పందించారు. పిచ్చి వాగుడు మానుకోవాలని హెచ్చరించారు

  • Publish Date - April 19, 2024 / 07:15 PM IST

*ఎవరికి ప్రజాదరణ ఉందో తేల్చుకుందాం.

*పొన్నంను మంచి డాక్టర్ కు చూపిస్తే బెటర్

*బండి సంజయ్ తరపున నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేతలు

విధాత బ్యూరో, కరీంనగర్: గత కొద్దిరోజులుగా బీజేపీపైన, బండి సంజయ్ పైన మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రతిస్పందించారు. పిచ్చి వాగుడు మానుకోవాలని హెచ్చరించారు. పొన్నం తీరు చూస్తే ఆయనకు మతి భ్రమించినట్లు కనపడుతోందని, వెంటనే మంచి డాక్టర్ కు చూపించి ట్రీట్ మెంట్ ఇప్పించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. పొన్నంకు దమ్ముంటే మంత్రి పదవికి రాజీనామా చేసి,పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. ప్రజల్లో ఎవరికి ఎక్కువ ఆదరణ తేలిపోతుందన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ తరపున పార్టీ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, కరీంనగర్ కార్పొరేషన్ మాజీ మేయర్ డి.శంకర్, కార్పొరేటర్ రమణారెడ్డి తదితరులు శుక్రవారం కరీంనగర్ కల్టెకరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.

గత కొద్దిరోజులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తమ పార్టీపై, బండి సంజయ్ పై అవాకులు, చవాకులు పేలుతున్నారని తెలిపారు. మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే విషయాన్ని విస్మరించి ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు.చివరకు న్యాయ స్థానాలపైన కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. లిక్కర్ స్కాం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బీజేపీకి రూ.500 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇవ్వగానే… కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని సత్య దూరమైన ప్రకటనలు చేస్తున్నారు. శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు… బెయిల్ కు, బాండ్స్ కు సంబంధమేమిటని? వారు ప్రశ్నించారు.సుప్రీం కోర్టు పొన్నం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసులు జారీ చేయాలని వారు అభ్యర్థించారు.

పొన్నంను చూస్తే తమకు జాలేస్తోందని,ఏ సర్వే చూసినా బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నడని తేలడంతో పొన్నంకు ఫ్ట్రస్టేషన్ ఎక్కువైందన్నారు. అందుకే కరీంనగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరో నేటి వరకు తేల్చలేకపోయారన్నారు.
లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే మంత్రి పదవికే ఎసరొస్తుందనే భయం ఆయనకు పట్టుకుందన్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా మంత్రిగా ఉన్నప్పుడు చేసే వ్యాఖ్యలు ఆదర్శంగా, హుందాగా ఉంటేనే ప్రజలు హర్షిస్తారని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు వెళ్ళాలంటే ఆ పార్టీ నేతలే భయపడుతున్నారని,చివరకు మీడియా మిత్రుల పరిస్థితి అదే విధంగా ఉందన్నారు.

పొన్నం ప్రభాకర్ కు ధైర్యం ఉంటే బండి సంజయ్ పై అవాకులు చవాకులు పేలడం మానుకుని, మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీ గా పోటీ చేయాలని, అప్పుడు ప్రజలు ఎటువైపు వుంటారో, ఎవరికీ ప్రజాభిమానం వుందో తేలిపోతుందన్నారు.

Latest News