కేసీఆర్ ఇదేం భాష.. తెలంగాణ ప్రజల బతుకు నాశనం చేసింది మీరే!

కేంద్ర మంత్రిగా, రాష్ట్రం ముఖ్యమంత్రిగా,వివిధ హోదాల్లో పని చేసిన కే చంద్రశేఖర రావు వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు

  • Publish Date - April 8, 2024 / 01:48 PM IST

  • రైతుల చేతులకు బేడీలు వేయించింది మీరు కాదా?
  • నేత కార్మికుల బకాయిలు నాడు ఎందుకు విడుదల చేయలేకపోయారు?
  • నయీం కేసు తిరగతోడాలి
  • నా ఫోన్ కూడా టాప్ చేశారు
  • 10వ తేదీన సిరిసిల్లలో చేనేత దీక్ష
  • విలేకరుల సమావేశంలో బండి సంజయ్ కుమార్
  • విధాత బ్యూరో, కరీంనగర్: కేంద్ర మంత్రిగా, రాష్ట్రం ముఖ్యమంత్రిగా,వివిధ హోదాల్లో పని చేసిన కే చంద్రశేఖర రావు వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని, గతంలో ఇదే భాష, యాసతో ఆయన తెలంగాణ ప్రజల బతుకులు నాశనం చేశారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి, అధికారం కోల్పోగానే తట్టుకోలేక పాత భాషనే ఆయన తిరిగి ఉపయోగిస్తున్నారని చెప్పారు.

    కేసీఆర్ ‘పొలం బాట’ పేరిట కరీంనగర్ జిల్లాలో చేసిన పర్యటనను స్వాగతిస్తూనే, ఇప్పటికైనా ఆయనకు బుద్ధి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘ఎండిపోయిన పంట పొలాలు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఇబ్బందులు పడ్డ రైతులు’మాజీ ముఖ్యమంత్రికి ఇప్పటికైనా గుర్తుకు రావడం మంచి పరిణామమే అన్నారు.

    శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ఈ పర్యటనలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో 11,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో ఏ ఒక్కరినైనా కెసిఆర్ పరామర్శించారా? వారి కుటుంబాలను ఆదుకున్నారా? అని నిలదీశారు.

    తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుల చేతులకు బేడీలు వేయించింది, వరి వేస్తే ఉరివేసినట్టేనని రైతులను ఆందోళనకు గురిచేసిన విషయాలు ఆయనకు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.

    రైతుబంధు పేరుతో వ్యవసాయ రంగానికి సంబంధించిన సబ్సిడీలు అన్నీ ఎత్తివేసి రైతుల బతుకులు ఆగం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. నాడు లక్ష రూపాయల రుణమాఫీ అమలు కాక రాష్ట్రంలోని అనేక మంది రైతులు బ్యాంకులలో డిఫాల్టర్లుగా మారిపోయారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు.దురదృష్టవశాత్తు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధానాలను అవలంబిస్తొందని విమర్శించారు.

    మా ఫోన్లు టాప్ చేశారు…

    రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ ఉదంతంపై బండి సంజయ్ స్పందించారు. తన ఫోన్ కూడా టాపింగ్ జరిగిందని చెప్పారు. తమ పార్టీ కోర్ కమిటీ లో జరిగిన నిర్ణయాలతో సహా, తన ప్రతి కదలిక ప్రభుత్వానికి తెలిసిందన్నారు. పార్టీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరుల ఫోన్లు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేయించిందన్నారు. ఫోన్ క్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.

    ప్రభుత్వం పదిమంది ఫోన్లు ట్యాప్ చేయమంటే, అధికారులు 20 మంది ఫోన్లు టాప్ చేస్తూ వచ్చారని చెప్పారు.ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధా కిషన్ రావు, అదే కేసులో నిందితునిగా భావిస్తున్న ప్రభాకర్ రావు తమ విశేష అధికారాలను ఉపయోగించుకొని బిజెపి కార్యకర్తలను రాచిరంపాన పెట్టారని, పలు సందర్భాలలో పార్టీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అందుకు తగిన ఫలితాన్ని ప్రస్తుతం వారు అనుభవిస్తున్నారని చెప్పారు.

    ఫోన్ టాపింగ్ కేసులో విచారణ సందర్భంగా అరెస్టు అయిన పోలీసు అధికారులు ఎన్నికల సందర్భంగా పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించిన విషయాన్ని అంగీకరించడం చూస్తే, వారు అధికారులా? కెసిఆర్ కుటుంబ బానిసలా? అనేది అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ టాపింగ్ విషయాన్ని విచారణ పేరుతో కాలయాపన చేయొద్దని సూచించారు.

    నయీమ్ పై వేసిన సిట్ దర్యాప్తు ఎటు పోయింది?

    రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నయీమ్ ఎన్కౌంటర్ కు సంబంధించి విచారణ ఎక్కడి వరకు వచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. దీనిపై వేసిన సిట్ ఇంతవరకు ఏమి తెమల్చ లేకపోయిందన్నారు. నయీం ఎన్కౌంటర్ అనంతరం లభ్యమైన డబ్బంతా ఎక్కడ పోయిందంటూ, ఆ మొత్తాన్ని రికవరీ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆమె ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల అమలుకు సంబంధించిన నిధులన్నీ సమకూరుతాయన్నారు.

    గతంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై, డ్రగ్స్ విషయంలో వేసిన సిట్ విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ఆయా కేసులకు సంబంధించి బాధ్యులైన వారిని పట్టుకోకుండా, ఎవరిని వదిలిపెట్టం అనడంలో అర్థం లేదన్నారు.

    చేనేత కార్మికులకు అండగా ఉంటాం.. సిరిసిల్ల రాజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన సిరిపురం లక్ష్మీనారాయణ అనే చేనేత కార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకోవడం పట్ల సంజయ్ విచారం వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. చేనేత కార్మికులు అందరికీ బిజెపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలకు, పేదరికానికి, వారి బతుకులు నాశనం కావడానికి టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో కారణం అన్నారు. టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నేతన్నలకు విడుదల చేయాల్సిన 270 కోట్ల బకాయిలను ఎందుకు విడుదల చేయలేకపోయిందని ప్రశ్నించారు.

    10వ తేదీన చేనేత దీక్ష…

    సిరిసిల్ల నేత కార్మికులకు భరోసా ఇచ్చేందుకు, ఆత్మహత్యల నుండి వారిని బయటపడేసేందుకు ఈనెల 10వ తేదీన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత దీక్ష చేపట్టనున్నట్టు బండి సంజయ్ వెల్లడించారు.