రిజర్వేషన్లపై సీఎం రేవంత్ దుష్ప్రచారం: లక్ష్మణ్

బీజేపీ 400 స్థానాల్లో విజయం సాధిస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు.

  • Publish Date - April 27, 2024 / 06:10 PM IST

మైనార్టీ సంతుష్టీకరణతో కాంగ్రెస్ రాజకీయం
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజం

విధాత: బీజేపీ 400 స్థానాల్లో విజయం సాధిస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాదారు. రాహుల్ గాంధీ పదే పదే రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తున్నారని, కశ్మీర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 70 ఏళ్లుగా రిజర్వేషన్లకు నోచుకోలేకపోయారని, అలాంటి వారికి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది మోడీ ప్రభుత్వం అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే పాక్ ఆధీనంలోకి పీవోకే వెళ్లిందని ఆరోపించారు.

నర నరాన హిందూ వ్యతిరేకతను నింపుకుని దేవీ దేవతలను అవమానించే స్థాయికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతృష్టికర విధానానికి చేరుకుందని దుయ్యబట్టారు. అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుందని విమర్శించారు. శ్రీరాముడిని అవమానించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ రాహుల్‌గాంధీ హాజరు కాలేదని, సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకించిందని తెలిపారు. కొత్తగా సీఏఏపై తీవ్ర ఆరోపణలు చేస్తోందని, పాక్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లలో మైనార్టీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని ఆరోపించారు.

హిందువులు, జైనులు, క్రైస్తవులు మత హింసకు గురవుతున్నారని, వారంతా శరణార్థులుగా భారత్‌కు వస్తామని వేడుకుంటున్నారని వెల్లడించారు. వారికి పౌరసత్వం ఇస్తామంటే హస్తం పార్టీ వ్యతిరేకిస్తోందని, సీఏఏను మతంతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని దుష్ప్రచారానికి దిగారని, అంబేద్కర్ ఆశయాలను బీజేపీ నెరవేరుస్తోందదని, అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్ లో పెట్టి భారతరత్నతో గౌరవించామని, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. రూ.350 కోట్లతో స్పూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ సేవలు, త్యాగాలు భావితరాలకు అందించేందుకు యత్నిస్తున్నామన్నారు.

Latest News