బోనస్ మాట దేవుడెరుగు.. ముందైతే ధాన్యం కొనుగోలు చేయండి

మార్పు తెస్తాం.. అందరినీ ఉద్దరిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని బీఆర్ఎస్ కరీంనగర్ లోకసభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు

  • Publish Date - April 23, 2024 / 07:04 PM IST

*రుణమాఫీపై దేవుడి మీద ఒట్టేసి
చెబుతున్నారు. అమలయ్యేనా!

*కౌలు రైతుల
సంగతేమిటి?

*బీఆర్ఎస్ అభ్యర్థి
బోయినపల్లి వినోద్ కుమార్

విధాత బ్యూరో, కరీంనగర్: మార్పు తెస్తాం.. అందరినీ ఉద్దరిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని బీఆర్ఎస్ కరీంనగర్ లోకసభ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో రైతు రాజ్యం తీసుకువస్తామని, వారి బాధలు తీరుస్తామన్న హామీలు నోటి మాటలుగానే మిగిలిపోయాయ న్నారు. మంగళవారం ఆయన మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

అధికారంలోకి రాగానే పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు, ఇప్పుడేమో వచ్చే పంట నుంచి బోనస్ అమలు చేస్తామంటున్నారు.. దీనిని రైతాంగం నమ్మే స్థితిలో లేరన్నారు. బోనస్ సంగతి పక్కన పెడితే కొనుగోలు కేంద్రాలలోనే సౌకర్యాలు సక్రమంగా లేవని, గోనె సంచులు అందుబాటులో లేక కొనుగోళ్లు నిలిచిపోతున్నా, ప్రభుత్వ పట్టించుకోవడం లేదన్నారు.

రైతులకు డిసెంబర్ 9న చేస్తామన్న రుణమాఫీ, ఆగస్టు 15వ తేదీకి వాయిదా పడిందని, ఆ తేదీ వరకు తప్పక చేస్తామని సీఎం దేవుళ్ల మీద ఒట్టేసి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు రూ. 12 వేల సాయంపై ప్రభుత్వం ఇప్పటివరకు నోరు మెదపలేదన్నారు. సకాలంలో సాగునీరు ఇవ్వని ప్రభుత్వ వైఫల్యాలతో పంటలు ఎండిపోయి కౌలు రైతులు
తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పిటిసి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News