BRS Vs Congress | బాకీ కార్డు పై బస్తీమే సవాల్

'బాకీ కార్డు'పై కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ చర్చకు సవాల్ విసిరారు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయని కాంగ్రెస్‌కు తమను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.

brs-dasyam-vinay-bhaskar-challenges-congress-for-baaki-card-promises

విధాత, వరంగల్ ప్రతినిధి: ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పై తమ పార్టీ విడుదల చేసిన బాకీ కార్డుల పై ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నేత, మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ చేశారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని అమలు చేయని కాంగ్రెస్ నాయకులకు మమ్మల్ని విమర్శించే నైతిక హక్కులేదని అన్నారు. హనుమకొండ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, చల్లా ధర్మారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నిక‌ల సంద‌ర్భంగా 420 హామీలు , 6 గ్యారెంటీలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు ఒక్కో మహిళకు రూ.50వేలు, వృద్దులకు, దివ్యాంగుల‌కు 44 వేలు బాకీ ఉందన్నారు. కేసీఆర్ కల్యాణ లక్ష్మి అమలు చేస్తే అదనంగా తులం బంగారమిస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. 2 లక్షల‌ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఈ బాకీ కార్డు ప్రచారం చేపట్టామన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్ళను కూల్చుతున్నారని, గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టును అవమానిస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యల పై ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న తమపైన అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసులకు తాము భయపడేవాళ్ళం కాదన్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రంతోపాటు వరంగల్ అభివృద్ధి కుంటుప‌డిందన్నారు. తమ ప్రభుత్వం రెసిడెన్సియల్ పాఠశాలలు, టెక్స్టైల్ పరిశ్రమ, భద్రకాళి అభివృద్ధి, మిషన్ భగీరథ, కాకతీయ తదితర అనేక పథకాల ద్వారా అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మర్రి యాదవరెడ్డి, జోరిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.