విధాత,ప్రత్యేకప్రతినిధి: సాధారణంగా బస్తీమా సవాల్ అంటారూ కానీ, అందరిలా మేమూ అదే మాటంటే ఏముందనుకున్నారేమోగానీ హనుమకొండ నాయకులు మాత్రం ‘బస్టాండ్ మే’ సవాల్ అంటూ గురువారం రాజకీయ రంగంలోకి దిగారు. ఉత్తిగా బస్టాండ్ మే సవాల్ అంటేముందని బీఆర్ఎస్ నాయకులు భావించారేమో. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నందున వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని హనుమకొండ బస్టాండ్ కు గన్ మెన్ లు లేకుండా రావాలంటూ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ చేశారు. దీంతో మరోసారి వరంగల్ పశ్చిమ కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ళ పర్వం సాగింది.
గన్ మెన్ లు లేకుండా బస్టాండ్ కు నాయిని
గన్ మెన్లు లేకుండా రావడమే కాదూ…. వచ్చి చిరువ్యాపారులను కలువాలంటూ చిన్న క్లాజు కూడా విధించారు. ఇంకేముందీ… తానేమి తక్కువనా….ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి గన్ మెన్ లొచ్చారూగానీ, రెండేళ్ళ క్రితం వరకూ ఆ గన్ మెన్ లూ లేకుండానే తిరిగాను కదా? అనుకున్నారో? లేదంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తెలియదుగానీ బస్తీమే సవాల్ అంటూ ‘హనుమకొండ బస్టాండ్ కు’ అనుచరులు, హంగామాతో పాటు నిజంగానే గన్ మెన్ లు లేకుండా ఓ ద్విచక్రవాహనం మీద వచ్చారు. వచ్చి బస్టాండ్ అంతా కలియతిరిగారు. బస్టాండ్ పరిసరాల్లోని చిరువ్యాపారులు, ఫుట్ పాత్ వ్యాపారులను కలిసి వాళ్ళ మంచీ, చెడూ సాధకబాదకాలు తెలుసుకున్నారు. అంతేనా రాజకీయ నాయకులు కదా? మీడియాతో మాట్లాడారు.
సవాల్ కు నిలబడని వినయ్ : నాయిని
బీఆర్ఎస్ నాయకులు సవాల్ ను స్వీకరించి బస్టాండ్ కు వచ్చానని నాయిని మీడియా సమావేశంలో చెప్పారు. తాను ఏప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల పక్షం నిలబడ్డానే కానీ హంగు ఆర్భాటాలకు ముందు వరుసలోలేనని వెల్లడించారు. గతంలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సవాల్ విసిరి ముందుకు రాలేదన్నారు. దిగజారుడు పనులు చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించిన డాక్టర్ రాజయ్య కూడా నా యొక్క పనితనాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు దొరగారి దొడ్డిలో బానిసవ్వడం, ఆ దొర మెప్పుకోసం ఊకదంపుడు ఉపన్యాసాలు అర్థం లేని మాటలు మాట్లాడడం సరికాదన్నారు. మంచి వ్యక్తి తప్పుడు పార్టీలో ఉన్నారని ఎమ్మెల్యే నాయిని ఏద్దేవా చేశారు.
నాయిని దమ్ముంటే బస్టాండ్ కు రా: వినయ్
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి దమ్ముంటే గన్ మెన్ లు లేకుండా హనుమకొండ బస్టాండ్ కు వచ్చి చిరువ్యాపారులను కలువాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ చేశారు. గురువారం బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజయ్య,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. చిరువ్యాపారుల పొట్టకొట్టి, వారి హక్కులను కాలరాశారని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని తీరు పై చిరువ్యాపారులు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. అడ్డిమారి గుడ్డిదెబ్బలో గెలిచిన ఎమ్మెల్యే తాము పత్తి రైతుల గురించి నిరసన వ్యక్తం చేస్తే విమర్శిస్తున్నారని అన్నారు. హరీష్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నాయినికి అక్షర జ్ఞానం లేదని డాక్టర్ రాజయ్య విమర్శించారు.
