మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి
బీఆరెస్ నేత క్రిశాంక్ డిమాండ్
విధాత : సోమ్ డిస్టలరీస్‌కి అనుమతులపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించి, విచారణకు వీలుగా సీఎం రేవంత్‌రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీఆరెస్ నేత క్రీశాంక్ బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఈనెల 21న ప్రెస్‌మీట్‌లో ఎలాంటి మద్యం కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వ్యాపారం చేయడానికి ప్రతిపాదనలు పెట్టలేదని చెప్పారు. పైగా అలా ప్రచారం చేసే మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని బెదిరించారని గుర్తు చేశారు. అదే జూపల్లి ఈ నెల 28న విడుదల చేసిన లేఖలో సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు అనుమతులు ఇవ్వడం వాస్తవమే అని, దీనిపై తనకు తొలుత సమాచారం లేదని ఒప్పుకున్నారని తెలిపారు.
నకిలీ మద్యానికి పేరుగాంచిన సోమ్ డిస్టిలరీస్ వ్యాపార సంస్థ తెలంగాణ రాష్ట్రంలో తన వ్యాపారం మొదలు పెడుతుంటే కనీసం సమాచారం లేదని మంత్రి అనడం బాధ్యతరహిత్యమని క్రిశాంక్ ఫైర్ అయ్యారు. సోమ్ డిస్టలరీస్ సంస్థను నకిలీ మధ్యం విషయమై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేదం విధించిందని, అక్కడ ఆ సంస్థ మద్యంతో 24మంది చనిపోయిన సంగతులు మంత్రికి తెలియవా అని ఫ్రశ్నించారు. నకిలీ మద్యం సంస్థ సోమ్ డిస్టలరీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఏకంగా ఒక కోటి 31 లక్షల రూపాయలు విరాళాలుగా తీసుకుందని, అందుకేనా తెలంగాణలో ప్రజారోగ్యాలను ఫణంగా పెట్టి ఆ సంస్థకు అనుమతులు ఇచ్చారా అని నిలదీశారు.
నకిలీ మద్యం సంస్థ సోమ్ డిస్టిలరీస్‌కు జూపల్లి వకాల్త పుచ్చుకొని తన లేఖలో ఆ సంస్థ గొప్పతనాన్ని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే ఆ సంస్థకు అనుమతుల వెనుక నిజానిజాలను తెలంగాణ సమాజం ముందుంచేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి జూపల్లిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు. లేదంటే సోమ్ సంస్థకు కాంగ్రెస్ పార్టీకి మధ్య డీల్ కుదరడంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని భావించవలసి వస్తుందన్నారు.