రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: హరీశ్‌

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు.

  • Publish Date - April 24, 2024 / 01:56 PM IST

ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. శుక్రవారం అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేస్తానని, ఒకే విడుతలో సీఎం పదవికి రేవంత్‌ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందారని, ఈ ఎన్నికల్లో ఆ ఎత్తులు సాగవన్నారు.

సంగారెడ్డిలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో చెప్పిచ్చి, ప్రతి మీటింగ్‌లో మీరు (రేవంత్‌రెడ్డి)చెప్పి, బాండు పేపర్లు రాసిచ్చి, కాళ్లు, చేతులు పట్టుకుని మీరు ఓట్లేయించుకున్నారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని మేము అడిగితే ఎందుకు ఈ డొంక తిరుగు మాటలు, ఎందుకు అబద్ధాలు మళ్లీ మళ్లీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. ఎల్లుండి (శుక్రవారం) అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దను తాను వస్తున్నానని, రేవంత్‌రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి చెబుతున్నారు కదా అది నిజమే అయితే మీరు రండి … ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దామని సవాల్‌విసిరారు. మీరు ఎన్నికలకు ముందు ఇచ్చి హామీను అమలు చేస్తే ఎమ్మెల్మే పదవికి రాజీనామా చేస్తానని, తిరిగి పోటీ చేయనని మాజీ మంత్రి తెలిపారు.

Latest News