MLC Kavitha | హైదరాబాద్ : టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఎన్నుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గులాబీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై కుట్రలు పన్నుతున్నారు.. నాపై కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే.. నాపైనే కక్ష కట్టారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కల్వకుంట్ల కవిత.. సింగరేణి బొగ్గుగని కార్మికులకు బహిరంగ లేఖ రాశారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని ఆమె పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగింది. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే నాపై కుట్ర పన్నుతున్నారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. నా తండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్లినప్పుడు లీక్ చేశారు. నాపై కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే.. నాపైనే కక్ష కట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికాలో ఉన్న సమయంలోనే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగింది.. చట్టవిరుద్ధంగా టీబీజీకేఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు అని కవిత తన లేఖలో పేర్కొన్నారు. పదేళ్ల పాటు TBGKS గౌరవాధ్యక్షురాలిగా కవిత పని చేశారు.