BRS Postcard protest | జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విభిన్నంగా పోస్ట్‌కార్డ్ ఉద్యమం ప్రారంభించారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి, పార్టీ మేనిఫెస్టోను ఆధారంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీహరి, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ప్రజలు, కార్యకర్తలకు నమ్మక ద్రోహం చేశారని వారు ఆరోపిస్తున్నారు.
బీఆర్‌ఎస్ నాయకుడు కనకం గణేష్ మాట్లాడుతూ, శ్రీహరి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని తమను పార్టీ హైకమాండ్ ఆదేశించిందని, తామంతా కష్టపడి ఆయన్ను గెలిపించామని తెలిపారు. కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరి పార్టీని, కార్యకర్తల్ని మోసం చేసి, కేవలం అధికారపక్షంలో ఉండాలని, తన కూతుర్ని ఎంపీ చేయాలని పార్టీ మారారని విమర్శించారు. అంతే కాకుండా, కాంగ్రెస్‌లో చేరిన తర్వాత స్పీకర్‌కు కూడా తాను ఏ పార్టీకి చెందినవాడో చెప్పే ధైర్యం చేయలేని శ్రీహరిరాజీనామా చేయకపోతే ప్రతీ గ్రామం నుంచి ఆయన ఇంటికీ, స్పీకర్‌కూ పోస్ట్‌కార్డులు పంపిస్తామని గణేష్ హెచ్చరించారు. మరో బీఆర్‌ఎస్ నేత పెసరు సారయ్య మాట్లాడుతూ, రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోగా, నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని తూర్పారపట్టారు. నిజంగానే కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవగలనని నమ్మకం ఇప్పుడు ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉపఎన్నికలలో పోటీ చేయాలంటూ సవాలు విసిరారు.
స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు చేపట్టిన పోస్ట్‌కార్డ్ ఆందోళన వల్ల ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజీనామా చేయకపోతే ఉద్యమం మరింత ముదిరే అవకాశం ఉందని బిఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.