Site icon vidhaatha

ఫామ్‌హౌస్‌లో రెండో రోజు ఆరుగురు ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

కాంగ్రెస్ వలకు చిక్కవద్దని హితవు

విధాత, హైదరాబాద్‌ : పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో బీఆరెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో బుజ్జగింపు పర్వాన్ని సాగిస్తున్నారు. తన ఎర్రవెల్లి ఫౌమ్‌హౌస్‌లో వరుసగా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్న కేసీఆర్ మంగళవారం తొలి రోజు బీఆరెస్ ఆరుగురు ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై పార్టీ మార్పు విషయంలో తొందర పడవద్దని సూచించారు. పరిస్థితులు భవిష్యత్తులో మన పార్టీకి అనుకూలంగా మారుతాయని భరోసా కల్పించారు. రెండో రోజు బుధవారం మరో ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీఅయ్యారు.

మాజీ మంత్రులు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గిడ్డంగుల మాజీ చైర్మన్ దివంగత నేత సాయిచంద్ భార్య రజినితో కేసీఆర్‌ సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు గురి కావద్దని, రాజకీయాల్లో పరిస్థితులు వేగంగా మారుతాయని, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఎంతో కాలం పట్టదని, మళ్లీ మనదే భవిష్యత్తు అని నమ్మకం కల్పించే ప్రయత్నం చేశారు. సమావేశంలో చర్చించిన అంశాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌తో భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పాలన సాగుతున్న తీరు వంటి చాల అంశాలపై చర్చించామని, అవన్ని సీక్రెట్ అని, బయటకు వెల్లడించలేమని చెప్పారు.

Exit mobile version