నువ్వు మొగోనివి అయితే ఆ హామీలు అమలు చేసి చూపెట్టు

  • Publish Date - April 3, 2024 / 05:20 PM IST

విధాత, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నీ ఫెవరేట్ డైలాగ్ మేరకే అడుగుతున్నా.. నువ్వు మొగోనివి అయితే నీవు చెప్పిన 2లక్షల రుణమాఫీ, కోటి 67 లక్షల ఆడబిడ్డలకు చెప్పిన రూ. 2500, రూ. 4000 పెన్షన్ ఇచ్చి చూపెట్టాలని, అలాగే 24గంటవ కరెంట్, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురావాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్ల‌మెంట్ విస్తృతస్థాయి స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ‌లో మీడియాతో మాట్లాడుతూ రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడని, ఇంకా సిగ్గు చేటు ఏంటంటే.. ప‌రిపాల‌న నా చేతుల్లో లేదని.. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ చేతుల్లో ఉందని చెప్పాడని, మ‌రి సీఎంగా నువ్వు ఎందుకు..? అని ప్రశ్నించారు.

ఎన్నికల కోడ్ ఉన్నా ప‌రిపాల‌న అల్టిమేట్‌గా సీఎం చేతుల్లోనే ఉంటుందని, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ స‌మన్వ‌యం చేస్తుందని, ఇది కూడా రేవంత్ రెడ్డికి తెలియ‌కపాయని ఎద్దేవా చేశారు. పరిపాలన చేతగాని గుంపు మేస్త్రీ రేవంత్‌రెడ్డి, తాపిమేస్త్రీ ప్రధాని మోదీలు ఇద్ద‌రు క‌లిసి తెలంగాణ‌కు, బీఆరెస్‌ స‌మాధి క‌ట్టే ప‌నిలో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు.

ఓటమి భయంతోనే ఇంచార్జిగా తప్పుకున్న రేవంత్‌రెడ్డి

చేవెళ్ల‌లో కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి లేద‌ని తెలుసుకుని నిన్న మొన్న‌టి దాకా ఇంచార్జిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు త‌ప్పుకున్నాడని కేటీఆర్‌ ఆరోపించారు. సీఎంగా ఉండి సీటు ఓడిపోతే ప‌రువు పోత‌ద‌ని గ్ర‌హించి జారుకున్నాడని, చేవెళ్ల‌లో కాసాని జ్ఞానేశ్వ‌ర్ త‌ప్ప‌కుండా గెలుస్తున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పొర‌పాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. రుణ‌మాఫీ చేయ‌కున్నా మాకే ఓటేశారని, రైతుబంధు ఇవ్వ‌క‌పోయినా మాకే ఓటేశారని, పెన్ష‌న్లు ఇవ్వ‌కున్నా మాకే ఓటేశారని చెప్పి చెప్పిన హామీలు ఏవి అమలు చేయరన్నారు.

గ్రేటర్ పరిధిలో మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల పార్లమెంటు స్థానాలో బీఆరెస్ తప్ప కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి లేదన్నారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపోళ్లు కాంగ్రెస్‌కు స‌హ‌క‌రించారని, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు బీజేపీకి స‌హ‌క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారన్నారు. పార్టీ మారిన ఎంపి రంజిత్‌రెడ్డి సెంటిమెంట్లకు పడిపోవద్దని, దొంగల పార్టీలో కలిసిపోయావని చెప్పండని, రాజ‌కీయ జీవితం ఇచ్చిన కేసీఆర్‌పై ఆయ‌న‌కు ప్రేమ లేన‌ప్పుడు.. మ‌నం ఎందుకు ప్రేమ చూపించాలని ప్రశ్నించారు.

స్వార్థ రాజకీయాలతో కాంగ్రెస్‌లోకి వెళ్లిన రంజిత్‌రెడ్డి వంటి అవ‌కాశావాదిని ఓడ‌గొట్టాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందన్నారు. రంజిత్ రెడ్డి ఇంటికి వ‌స్తే చాయ్ తాగించి ఓదార్చండి.. కానీ బ‌రాబ‌ర్ ఓడగొడుతామ‌ని చెప్పండన్నారు. మ‌న పార్టీని ఖ‌తం చేయాల‌ని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంటే.. రేవంత్ రెడ్డి ద‌గ్గ‌ర కండువా క‌ప్పించుకున్న అవకాశవాది రంజిత్‌రెడ్డిని ఓడించి బుద్ధి చెప్పాలన్నారు.

Latest News