ప్రతిపక్ష నేతలను టార్గెట్‌ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు … మాజీ మంత్రి టి.హరీశ్‌రావు

అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయని, ఈడీ, ఐటీ దాడులతో లొంగతీసుకునే ఒత్తిళ్లకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి టి. హరీశ్‌ రావు ఆరోపించారు

  • Publish Date - June 21, 2024 / 03:05 PM IST

విధాత, హైదరాబాద్‌ : అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ చేసి వేధిస్తున్నాయని, ఈడీ, ఐటీ దాడులతో లొంగతీసుకునే ఒత్తిళ్లకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి టి. హరీశ్‌ రావు ఆరోపించారు. పటాన్‌చెరు బీఆరెస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో శుక్రవారం మహిపాల్ రెడ్డి, వారి తమ్ముడులను పరామర్శించి మాట్లాడారు. మహిపాల్ రెడ్డినివాసంలో కనీసం డబ్బు కాని, బంగారం కానీ అక్రమంగా దొరకలేదని, ప్రతిదీ ఐటీ రిటర్న్స్‌తో సహా పక్కా వివరాలతో స్పష్టంగా ఉన్నాయని, ఒక్క తప్పు కూడా లేదన్నారు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని కితాబు ఇచ్చారు. ఇంట్లో చిన్న పిల్లలు ఏడుస్తున్నా కర్కశంగా ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ దాడులు చేయటం దారుణమన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ధర్మం గెలుస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీఆరెస్‌ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టు తిరుగుతూ వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహించబోమని, పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పి అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కదలికలను ఇంటెలిజెల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా నిఘా పెడుతూ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే పనిచేస్తోందన్నారు.

నీట్ ప్రశ్నపత్రం లీకైతే దర్యాప్తు చేయరా?
నీట్ ప్రశ్నపత్రం లీకైతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. అధికార పక్షానికి ఒక నీతి, ప్రతిపక్షాలకు ఒకనీతినా? అని ఘాటుగా విమర్శించారు. 24 లక్షమంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారన్నారు. బిహార్, గుజరాత్‌లలో పరీక్షకు రెండురోజుల ముందు పేపర్ లీకైందని,ప్రశ్న పత్రాలను అంగట్లో సరుకులా లక్షలకు అమ్ముకుంటుంటే ఈడీ, ఐటీ ఎక్కడెకెళ్లాయన్నారు. అక్కడ మనీల్యాండరింగ్ కనిపిచం లేదా? అక్కడ అధికారులపై, పరీక్షలు జరిపిన ఎన్టీఏపై ఎందుకు దాడులు జరపడం లేదని ప్రశ్నించారు. హరీష్ రావు వెంట జిల్లా పరిషత్ చైర్ పర్శన్ నుంజుశ్రీ, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ తదితరులు ఉన్నారు.

Latest News