చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలు గురు శిష్యులు కాదు,సహచరులమేనని రేవంత్ గతంలో చెప్పారు .. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డికి గురువు కాదని.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచరుడు మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. చంద్రబాబు, రేవంత్ గురు శిష్యులు అని కొందరు చెప్పేవి అవగాహన లేని మాటలని కొట్టిపారేశారు.

  • Publish Date - July 3, 2024 / 05:20 PM IST

విధాత, హైదరాబాద్ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డికి గురువు కాదని.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచరుడు మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. చంద్రబాబు, రేవంత్ గురు శిష్యులు అని కొందరు చెప్పేవి అవగాహన లేని మాటలని కొట్టిపారేశారు. చంద్రబాబుతో బంధంపై రేవంత్ రెడ్డి చాలా సార్లు బహిరంగంగానే చెప్పారని గుర్తు చేసిన భట్టి సీఎ రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు కాదని.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచరుడు మాత్రమేనన్నారు. బుధవారం భట్టి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామన్నారు. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు. లక్ష రుణమాఫీ కి ఐదేళ్లు తీసుకుని.. అవి కూడా చేయని బీఆరెస్ పార్టీ మాపై అరుస్తుందని భట్టి మండిపడ్డారు. మీరు అరిచి గీ పెట్టాల్సిన అవసరం లేదని, చెప్పినట్లుగా తాము ఐదు లక్షల రుణమాఫీతో సహా ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. రైతు భరోసా సహాయం వ్యవసాయం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నదే మా ఆలోచన అని పేర్కోన్నారు. నా నేతృత్వంలోని సబ్ కమిటీ రైతుభరోసా సహాయం ఏ విధంగా ఉండాలన్నదానిపై ప్రజల మధ్య చర్చకు పెట్టి.. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, బడ్జెట్ సమావేశాల కంటే ముందే రైతు భరోసాపై పాత పది జిల్లాల్లో అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లుగా తెలిపారు. రైతులు.. ట్యాక్స్ చెల్లించే వారూ.. మేధావులతో మాట్లాడతామని, రైతు భరోసాపై వచ్చే అభిప్రాయాల నివేదికను అసెంబ్లీలో పెడతామని, ప్రజల ఆలోచన మేరకే సంపద పంచుతామన్నారు. మేము ఇచ్చే ప్రతి పథకం ప్రజల సొమ్ముతోనేనని.. ప్రజల సొమ్ముకు మేము కస్టోడియన్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. బీఆరెస్‌ వాళ్ళు తాము రైతు భరోసాపై ఏదో ఒకటి తేల్చాలని ఆశ పడుతున్నారని సైటెర్లు వేశారు.

ఏడు మండలాలపై హరీశ్‌రావు దీక్షకు కూర్చోవాలి

పదేళ్లు బీఆరెస్ అధికారం వెలగబెట్టిన కాలంలో ఏడు మండలాలను గాలికొదిలేసి ఇప్పుడు తగుదునమ్మా అని వాటిని తిరిగి తెలంగాణలో కలపాలంటున్న హరీశ్‌రావు కు చిత్తశుద్ధి ఉంటే దీక్షకు కూర్చోవాలని భట్టి సూచించారు. హరీశ్‌ రావు లాంటి కల్లబొల్లి మాటలు మేం చెప్పమన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో 7 మండలాలు ఏపీలో లేవని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆరెస్‌ అధికారంలో ఉండగానే ఏడు మండలాలు ఏపీలో విలీనం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. బీఆరెస్ అసమర్ధత వల్లనే ఏడు మండలాలు కోల్పోయామన్నారు. కేబినెట్ విస్తరణ అధిష్టానం ఇష్టమని, దాంతో పాటు పీసీసీపై త్వరగా నిర్ణయం చేయాలని చెప్పామన్నారు. కేబినెట్ విస్తరణ.. పీసీసీ నియామక కసరత్తు అధిష్టానం మొదలు పెట్టిందని భట్టి వెల్లడించారు. నా నియోజక వర్గం లో రైతు ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. ఎవరు ప్రోత్సహించారనేది విచారణ జరుగుతుందన్నారు. ఎవరున్న వారిపై చట్టపర చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Latest News