ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల చార్జిషీట్‌ …. బెయిల్‌ కోరిన మాజీ ఏఎస్పీలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ప్రణీత్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను అరెస్టు చేశారు.

  • Publish Date - June 11, 2024 / 05:21 PM IST

విధాత హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మార్చి 10న ఎఫ్ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ప్రణీత్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను అరెస్టు చేశారు. ఛార్జిషీట్లో ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, రియల్టర్లు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సస్పండెడ్ ఎస్ఐబీ డీఎస్సీ ప్రణీత్ రావు, సస్పెండెడ్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు చెప్పడంతో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అయితే ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారమే పోలీసులతో సమీక్ష నిర్వహించారు. మరుసటి రోజే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

నేడు వారిద్ధరి బెయిల్‌పై తీర్పు
మరో వైపు అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సి ఉన్నందున నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో బుధవారం తీర్పు వెల్లడించనున్నట్టు నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. వారికి బెయిల్‌ లభిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపిస్తాం
నారా లోకేశ్ కీలక ప్రకటన

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు తరహాలో ఏపీలో కూడా ఫొన్ ట్యాపింగ్ జరిగిందని, దీనిపై త్వరలో కేసు వేసి విచారణ జరిపిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెగాసిస్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై తమ దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించే అవకాశముందన్నారు.

Latest News