విధాత: కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఎన్నో ఏండ్ల నుంచి మీ సేవలో ఉన్నారు. పార్టీల యొక్క నడవడిక, వైఖరి గురించి ఆలోచించాలి. గతంలో అవకాశం ఇస్తే ఏం చేశారో ఆలోచించాలి. ఉద్యమం ప్రారంభించినప్పుడు మీరు చాలా మంది ఉన్నారు. మెట్‌పల్లి, కోరుట్లకు వచ్చాను. మీరంతా కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. బీఆర్ఎస్ పదేండ్ల ప్రభుత్వంలో, 50 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ సొంత అనుభవంలో ఉంది. అవన్నీ బేరీజు వేసుకోవాలి. ఆలోచించి ఓటేయాలి.
చేనేత కార్మికులు సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లి, దుబ్బాకలో ఆరేడుగురు చనిపోవడం.. మేం పోయి ఆ శవాలను పట్టుకొని ఏడ్వడం జరిగాయి. పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే నేను పోయి ఆ శవాలను పట్టుకొని అప్పుడున్న సీఎంకు రెండు చేతల దండం పెట్టి బతిమాలిడాను. ఒక యాభై వేలో, లక్ష రూపాయాలో ఇవ్వమని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కష్టాలు ఏమున్నాయి అని మేధావులతో నాలుగు మాసాలు ఆలోచించాం. మన కర్తవ్యం ఏందని కష్టపడి ఆలోచించి ఓ దారి పెట్టుకుని ముందుకు పోతున్నాం. మొదటగా పేదల సంక్షేమం గురించి ఆలోచించాం. అంతకు ముందు తమాషా కోసం పెన్షన్లు ఇచ్చేవారు. 70, 40, 200 పెన్షన్ చూశాం. కానీ వేల రూపాయాలకు తీసుకుపోయింది ఒక కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. నేను కొంతకాలం కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశాను. బీడీ కార్మికులు 19 రాష్ట్రాల్లో ఉన్నారు. బెంగాల్, మహారాష్ట్ర చాలా రాష్ట్రాల్లో ఉంటారు. కానీ పెన్షన్ ఇవ్వరు.
నేను హైస్కూల్ చదువుకున్నప్పుడు దుబ్బాకలో బీడీలు చేసే వారి ఇండ్లో ఉన్నాను. అక్కడ నాలోకి రెండు అనుభవాలు వచ్చాయి. వారు చేనేత కార్మికులు కూడా. మగాయన చీరలు నేసేది.. నాకు అన్నం పెట్టే అమ్మ బీడీలు చేసేది. వారు తినే తిండి, అవస్థలు చూశాను. వాళ్ల బాధలు కండ్లారా చూశాను. వాళ్లకు వచ్చే రోగాలు ఏవో కూడా తెలుసు. బీడీ కార్మికులు కష్టజీవులు అని తెలుసు కాబట్టే.. నాకు ఎవరూ దరఖాస్తు పెట్టకముందే.. నా అంతకు నేను ఆలోచించి బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాం. ఓట్ల కోసం, మోసం చేసేందుకు పెన్షన్లు ఇవ్వడం లేదు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవీ పది అయితే చెప్పకుండా చేసింది 100 కార్యక్రమాలు. బీడీ కార్మికుల పెన్షన్ రూ. 2 వేల నుంచి రూ. 5 వేలకు పోతది. గవర్నమెంట్ రాగానే మార్చిలో రూ. 3 వేలు అయితది. ఆ తర్వాత ఏడాదికి రూ. 500 పెరుగుతూ రూ. 5 వేలకు పోతది. బీడీ కార్మికులు ఎక్కడైతో ఉన్నారో.. కొత్త కార్మికులకు కూడా వంద శాతం పెన్షన్ మంజూరు చేస్తాను. ఇది నా వాగ్దానం.. రందీ పడాల్సిన అసవరం లేదు. ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాను.
‘దేశంలో పరిశ్రమలు, వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పుడు రైతులను కరెంటు బిల్లుల గురించి ఒత్తిడి చేసే అధికారులు లేరు. రైతుల నుంచి పన్నులు వసూలు చేసే వ్యవస్థ లేదు. మరి దీనికంతటికి కారణం ఎవరు..? బీఆర్‌ఎస్ పార్టీ కారణం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణం’.
‘వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలె, పల్లెలు బాగుండాలె, పల్లెల్లోకి సంపద రావాలె, రైతు మంచిగుంటే గ్రామాలు బాగుంటయని ఆలోచించి మేం ఒక పాలసీని పెట్టుకున్నం. అందుకే రైతులకు గుదిబండగా మారిన అన్ని రకాల శిస్తులను రద్దు చేసినం. గత ప్రభుత్వాలు నీటి తీరువా వసూలు చేసేవి. కరెంటుపైన పన్నులు వేసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నీళ్లకు ట్యాక్సులు లేవు. కరెంటుకు ట్యాక్సులు లేవు. పైగా రైతు బంధు ఇస్తున్నం. రైతు బీమా ఇస్తున్నం. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు పడుతున్నది. దాంతో రైతుల అప్పులు తీరుతున్నయ్. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే అవసరం తప్పింది’.
‘రాష్ట్రంలో రెండుసార్లు రైతు రుణాలు మాఫీ చేసినం. ఈసారి కూడా లక్ష రూపాయల వరకు రైతు రుణాలు మాపీ అయినయ్. లక్షకు పైన ఉన్న రుణాలు కూడా మాఫీ చేసేలోగా ఎలక్షన్ కోడ్ వచ్చి మాఫీ ఆగిపోయింది. ఎన్నికల తర్వాత లక్షకు పైన ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తం. అదేవిధంగా రైతుల భూముల్లో అక్రమాలకు తావు లేకుండా ధరణిని తెచ్చినం. ధరణి వల్లనే రైతుబంధు వస్తున్నది. రైతు బీమా వస్తున్నది. ధరణి తీసేస్తే రైతుబంధు ఇవ్వడం సాధ్యం కాదు. రైతు బీమా ఇవ్వడం కుదరదు. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెసోళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తం అంటున్నరు. ధరణిని కాదు, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి’
‘బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తం. కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దు. నమ్మి మోసపోవద్దు. సంజయ్ మంచి వైద్యుడు. ఆయన తలుచుకుంటే వృత్తి ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ నేను నా గడ్డకు సేవ చేసుకుంటా అనే సంకల్పంతో పోటీకి సిద్ధమైండు. నేను నిరాహార దీక్ష చేసిన సమయంలో డాక్టర్ సంజయ్ నన్ను దగ్గురుండి చూసుకున్నడు. నా ప్రాణాలు కాపాడిండు. డాక్టర్ సంజయ్ నాకు బిడ్డ లాంటి వాడు. రాష్ట్రంగానీ, దేశంగానీ బాగుపడ్డదా..? వెనుపడ్డదా..? అని తెలుసుకునేందు రెండే గీటురాళ్లు. అందులో ఒకటి ఆ రాష్ట్రం లేదా దేశం తలసరి ఆదాయం. 2014లో తెలంగాణ 18వ స్థానంలో ఉండె. ఇప్పుడు అద్బుతమైన పంటలతో ఆర్థికంగా ఎదిగి రూ.3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలో నెంబర్ వన్‌గా ఉన్నది. కరెంటు సప్లయ్‌లో కూడా తెలంగాణ నెంబర్ వన్‌గా ఉన్నది. కాబట్టి మీ అందరి సహకారంతో తెలంగాణ ఇదేవిధంగా ఇంకా ముందుకు పోవాలి. డాక్టర్ సంజయ్ స్థానిక బిడ్డ. ఆయనను మీరంతా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలి’.