కాళేశ్వరంపై దమ్ముంటే చర్చకు రా!

మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌, హరీశ్‌రావును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

  • Publish Date - April 25, 2024 / 09:30 AM IST

డిజైన్‌ మందేసి గీశారా?.. మందు దిగాక గీశారా?
తోకతెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్న మామా అల్లుళ్లు
హరీశ్‌.. రాజీనామా పత్రం సిద్ధం చేసుకో
ఆనాడు అగ్గిపెట్టె దొరకలేదని చెప్పినట్టుకాదు
ఆగస్ట్‌ 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తా
మోదీ.. జన్‌ధన్‌ ఖాతాల్లో 15 లక్షలు ఏవి?
బీజేపీ నాయకులకు మత పిచ్చి పట్టుకుంది
కబ్జాకోరు రమేశ్‌ అంగీ మార్చి వస్తున్నాడు
కడియం నిజాయితీ చూసి పార్టీలో చేర్చుకున్నాం
వరంగల్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్‌: మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌, హరీశ్‌రావును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్… నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో కూర్చున్నాడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ను మందేసి గీశాడో.. దిగాక గీసాడోగానీ కూలిపోయిందని ఎద్దేవా చేశారు. నువ్వు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాలు విసిరారు.

హరీశ్‌.. రాజీనామాకు సిద్ధంకా

‘రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా… పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా… హరీష్ రావు… రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాం.. ఆనాడు పెట్రోల్ పోసుకున్న నీకు అగ్గిపెట్టే దొరకలేదని చెప్పినట్లు కాదు’ అని అన్నారు.

రైతులను మోసం చేసిన మోదీ

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆత్మహత్యలు ఆపుతానని మోదీ హామీ ఇచ్చారని, కానీ, ఆత్మహత్యలు ఆగలేదు, ఆదాయమూ పెరగలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ మోసం చేశారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా ఈ ప్రాంతానికి మోదీ మోసం చేశారని, కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు మత పిచ్చి పట్టుకుందని ఆరోపించారు. భూములు ఆక్రమించుకున్న ఆరూరి రమేశ్‌.. అంగీ మార్చి, రంగు మార్చి వస్తుండని, ఏ రూపంలో వచ్చినా.. ఏ వేషంలో వచ్చినా ఆరూరి రమేశ్‌ను ప్రజలు బండకేసి కొడతారని హెచ్చరించారు.

భూములు ఆక్రమించుకునే రమేశ్‌ కావాలో.. పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తేల్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కడియం శ్రీహరి నిజాయితీ చూసి పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతం నుంచి మరో ఆడబిడ్డ కావ్యను ఆశీర్వదించాలని కోరారు. ఆరూరి రమేశ్‌కు ఓటు వేస్తే.. అనకొండగా మారి మీ భూములను మింగేస్తాడని హెచ్చరించారు. నిజాయితీని వారసత్వంగా తీసుకున్న… మీ కోసం కొట్లాడే కావ్యను గెలిపించాలని కోరారు. పోలింగ్ బూత్ లో ఓట్ల కోసం దేవుడి పేరు చెప్పుకోవద్దని రేవంత్‌రెడ్డి అన్నారు. దేవుడు గుడిలో ఉండాలి… భక్తి గుండెల్లో ఉండాలని చెప్పారు.

వరంగల్‌లో కూర్చొని సమస్యలు పరిష్కరిస్తా

వరంగల్ ప్రజల అండతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతీ గ్రామానికి నీళ్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ను నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని, వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసి మహర్దశ కల్పిస్తామన్నారు. నగరాన్ని పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, తానే స్వయంగా వచ్చి వరంగల్‌లో కూర్చొని సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమించి యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఉత్తర తెలంగాణ అంతా వరంగల్ వైపుచూసేలా అభివృద్ధి చేసే బాధ్యత తనదన్నారు.

Latest News