ఎందుకీ నాన్చివేత? నామినేషన్లకు మరొక రోజు మాత్రమే గడువు అయినా తేలని కాంగ్రెస్ అభ్యర్థి

లోకసభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటు బిజెపి, అటు బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ల

  • Publish Date - April 16, 2024 / 10:25 PM IST

విధాత బ్యూరో, కరీంనగర్: లోకసభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటు బిజెపి, అటు బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి, ఈ ఎన్నికల్లో అత్యధిక లోకసభ స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం కరీంనగర్ నుండి పోటీ చేసే తమ అభ్యర్థి ఎవరన్నది నేటికి ప్రకటించలేదు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్ హైదరాబాద్ పర్యటనలో ఉన్నందున ఆదివారం కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఒక ప్రకటన వెలువడవచ్చని అంతా భావించారు. అయితే మూడు రోజులు గడుస్తున్నా పార్టీ వైపు నుండి కరీంనగర్ అభ్యర్థిత్వం విషయంలో నిర్ణయం వెలువడకపోవడం స్థానిక కాంగ్రెస్ నేతలను నైరాశ్యంలో పడవేసింది.

అభ్యర్థి ఎవరన్నది ఇప్పటివరకు తెమల్చ లేకపోయినా, కరీంనగర్ లోకసభ పరిధిలోని నేతలతో ముఖ్యమంత్రి మంగళవారం జరిపిన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల, హుజురాబాద్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జులు కేకే మహేందర్ రెడ్డి,
ఒడితెల ప్రణవ్ బాబు, ముఖ్యమంత్రితో సమావేశమైన వారిలో ఉన్నారు.

అయితే ఈ సమావేశంలోనూ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. ఈ భేటీలో కేవలం కరీంనగర్ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సమస్యలు, మరి ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించిన అంశాలపైనే ఎక్కువ చర్చ నడిచినట్టు సమాచారం. అయితే కరీంనగర్ లోకసభ అభ్యర్థికి సంబంధించిన ప్రకటన మంగళవారం రాత్రి కాని, శ్రీరామ నవమి రోజు కానీ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్థానికంగా మాత్రం మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ వెలిచాల జగపతిరావు తనయుడు రాజేందర్ రావుకు పార్టీ అభ్యర్థిత్వం ఖరారు అయిందనే ప్రచారం సామాజిక మాధ్యమాలలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో? తెలియని పరిస్థితుల్లో అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి మద్దతు దారులు చివరి క్షణం వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. ఆయన అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని వారు ఆశావహ దృక్పథం తోనే ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల దిశగా పార్టీ కార్యకర్తలను సన్నద్ధం చేయడం, బూత్ వారీగా కమిటీ సభ్యులతో సమీక్షలు నిర్వహించడం, నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలతో బిజెపి, బీఆర్ఎస్ నేతలు తలమునకలై ఉండగా, కరీంనగర్ కాంగ్రెస్ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కానవస్తోంది. ఎన్నికల దిశగా కార్యకర్తలను కదిలించే నాధుడే ఇక్కడ కరువయ్యారు. అంబేద్కర్ జయంతి రోజు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేపట్టిన దీక్ష మినహా, ఎన్నికల దిశగా ఆ పార్టీ పెద్దగా కార్యక్రమాలు నిర్వహించింది లేదు.

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఇప్పటికే రెండుసార్లు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఒకసారి స్థానిక రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని తమ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసి వెళ్లారు.
అనంతరం రైతాంగ పరిస్థితులు ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల నియోజకవర్గాల పరిధిలో పర్యటించిన ఆయన అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. మరోవైపు బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా చుట్టి వచ్చారు. లోకసభ పరిధిలోని పార్టీ శ్రేణులతో,బూత్ స్థాయి కార్యకర్తలతో సన్నాక సమావేశాలు నిర్వహించారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి లోకసభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం ఏడు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని శాసనసభ్యులు సమిష్టిగా పనిచేస్తున్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో ప్రచార కార్యక్రమాలను వారు సమన్వయం చేసుకుంటున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దపల్లి సీటు కైవసం చేసుకోవాలనే దిశగా
అక్కడి నాయకులు ఎన్నికల రణక్షేత్రంలో ముందుకు సాగుతున్నారు.

అయితే కరీంనగర్ లో పరిస్థితి తద్విరుద్ధంగా ఉంది. ఇక్కడి కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కాన వస్తోంది.
ఒకటి రెండు రోజుల్లో ఏఐసీసీ నుండి అభ్యర్థి ప్రకటన వెలువడినా, నామినేషన్లకు పోలింగ్ కు మధ్య ఉన్న స్వల్పకాలంలో ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారాన్ని కొనసాగించడం
సాధ్యపడే విషయం కాదు. తక్కువ సమయంలో పార్టీ ప్రచారాన్ని పరిగెత్తించి అభ్యర్థిని గెలిపించుకోవడం మంత్రి పొన్నం ప్రభాకర్ కు కత్తి మీద సామ లాంటిదే!

Latest News