Tammareddy | సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదని పూర్తిగా కొట్టిపారేయలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సక్సెస్ మీట్‌లో తన కూతురు సుష్మిత గురించి మాట్లాడిన సందర్భంలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేదే లేదని, అమ్మాయిలు స్ట్రిక్ట్‌గా ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరని చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను గాయని చిన్మయి సహా పలువురు బహిరంగంగా ఖండించారు. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ ఈ అంశంపై స్పందిస్తూ చిరంజీవి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని పూర్తిగా కొట్టిపారేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
మహిళలపై వేధింపులు ఎప్పుడూ ఉన్నాయని, వాటిపై వచ్చిన ఆరోపణలను అలా పక్కన పెట్టలేమని స్పష్టం చేశారు. సినిమాలు ప్రారంభమైన 1930 ప్రాంతం గురించి మాట్లాడుతూ, మొదట్లో పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ కొన్నేళ్ల తర్వాత జమీందారులు, రాజులు సినీ రంగంలోకి ప్రవేశించారని, మహిళలను అనుభవించాలనే ఉద్దేశంతోనే కొందరు సినిమాలు తీసేవారని పేర్కొన్నారు. కాలక్రమేణా పరిస్థితులు మారాయని, తమ కాలంలో చాలా వరకు వాతావరణం మెరుగ్గా ఉన్నప్పటికీ అప్పట్లో కూడా 5 నుంచి 10 శాతం మేర మహిళలు వేధింపులకు గురయ్యారని చెప్పారు. అలాంటి పరిస్థితుల వల్లే కొందరు పరిశ్రమను వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 200 వరకు సినిమాలు తెరకెక్కుతున్నాయని, అందులో కొందరు అసలు ఎందుకు సినిమాలు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. అలాంటి వారిలో కొందరు అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారని, అది వాళ్ల వ్యక్తిగత వ్యవహారమని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే సీరియస్‌గా సినిమాలు తీసే పెద్ద దర్శకులు, నటులు ఇలాంటి వాటికి దూరంగానే ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర రంగాల్లో ఎలా మహిళలకు వేధింపులు ఉంటాయో, సినీ పరిశ్రమలో కూడా అలాంటి సమస్యలు ఉన్నాయన్న వాస్తవాన్ని అంగీకరించాల్సిందేనని చెప్పారు. అయినప్పటికీ వాటిని తట్టుకుని నిలబడే ధైర్యం మహిళలకు ఉండాలని, నిజమైన టాలెంట్ ఉంటే ఎవరూ తొక్కలేరని ఆయన స్పష్టం చేశారు. చిన్మయి విషయానికి వస్తే, వేధింపులపై ఆమె గళం విప్పి పోరాడినందుకు నిషేధం విధించడం దారుణమని తమ్మారెడ్డి అన్నారు. ఏడాది పాటు పని లేకపోయినా, తెలుగులో ఆమె నుంచి డబ్బులు తీసుకుని కార్డు ఇస్తే ఇక్కడ పని చేసుకోమని చెప్పిన పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళంలో మళ్లీ ఆమెకు అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. ఈ సమస్యపై ఎవరు తన వద్దకు వచ్చినా అండగా నిలుస్తానని, దీనిపై అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.
