Bengali actor Ritabhari Chakraborty । కేరళ సినీ ఇండస్ట్రీ మాలీవుడ్‌లో మహిళా నటులు, సిబ్బందిపై తీవ్ర స్థాయిలో లైంగిక వేధింపులు ఉన్నాయని జస్టిస్ హేమ కమిషన్ నివేదిక సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక్కొక్కరుగా హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలు వెల్లడిస్తున్నారు. బెంగాల్ సినీ ఇండస్ట్రీ (Bengali film industry) (టాలీవుడ్)లో సైతం లైంగిక వేధింపులు ఉన్నాయని బెంగాలీ నటి ఒకరు బయటపెట్టారు. హేమ కమిషన్ నివేదికను ప్రస్తావించిన రితాభరి చక్రబర్తి (Ritabhari Chakraborty) అటువంటి ఇబ్బందికర అనుభవాలు తనకూ ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఫేస్‌బుక్‌లో ఆమె ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee)ని ట్యాగ్ చేశారు. కేరళలో హేమ కమిషన్ తరహాలోనే విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని రితాభరి చక్రబర్తి కోరారు.
‘మలయాళ సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న లైంగిక దాడులను హేమ కమిషన్ (Hema Commission) నివేదిక బయటపెట్టినట్టే బెంగాలీ పరిశ్రమ విషయంలోనూ అటువంటి చర్యలే ఎందుకు తీసుకోకూడదన్న ఆలోచన నాకు కలిగింది’ అని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. వెలుగు చూసిన అంశాలు తనకు, తనకు తెలిసిన మహిళా నటులకు అనుభవంలోకి వచ్చినవేనని తెలిపారు. ‘అనేక కలలతో ఈ రంగంలోకి వస్తున్న యువ నటీమణుల విషయంలో మనకేమీ బాధ్యత లేదా? ఇది చక్కెర పూత పూసిన వ్యభిచారకూపం (brothel) అని వారు నమ్ముతున్నారు’ అని రితాభరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘అదే తరహా దర్యాప్తు, నివేదిక, సంస్కరణలు మేం కోరుతున్నాం’ అని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే ఎవరి పేర్లనూ రితాభరి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ.. ఇండస్ట్రీలో కొందరు అసభ్య ప్రవర్తనకు పాల్పడుతున్నారని, వాళ్ల ముసుగులు తొలగించాలని కోరారు. ‘తమ చర్యలకు ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొనని ఇటువంటి మురికి మనస్తత్వం (filthy mind) కలిగిన హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మహిళల పట్ల చాలా గౌరవభావం ఉన్నట్టు ఆర్ జీ కర్ బాధితురాలి (RG Kar victim) కోసం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఇటువంటి భక్షకుల ముసుగులు తొలగించాలి. ఈ రాక్షసులకు వ్యతిరేకంగా నా వెంట నిలబడాలని నా తోటి నటీమణులను కోరుతున్నాను’ అని ఆమె రాశారు. ‘వీరంతా చాలా ప్రభావవంతమైనవారు. మీకు వారు అవకాశాలు ఇవ్వరని మీరు భయపడతారని నాకు తెలుసు. కానీ ఎంతకాలం ఇలా మౌనంగా ఉందాం?’ అని రితాభరి ప్రశ్నించారు. ‘ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన మహిళలను వస్తువులుగా, తమ శక్తిని లేదా లైంగికతను సంతృప్తిపర్చేవారిగా చూసే హక్కు ఏ మగాడికీ లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
బెంగాలీ పరిశ్రమలో ప్రముఖ పేరు అయిన రితాభరి.. చోటుష్కోన్, వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ కోల్‌కతా, బావల్, ఫటాఫటి వంటి సినిమాల్లో పనిచేశారు. సీనియర్ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఇటీవలే ఒక ప్రముఖ మలయాళం దర్శకుడు తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే.