విద్యుత్తు రంగం ప్రైవేటీకరణకు కాంగ్రెస్ కుట్ర , అందుకే ఆదానీకి బిల్లుల వసూళ్లూ … మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఫైర్

ద్యుత్తు బిల్లుల వసూళ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయాలుతీసుకోబోతుందని, అందుకే పాతబస్తీలో విద్యుత్తు బిల్లుల వసూళ్ల ప్రక్రియను ఆదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆరోపించారు

  • Publish Date - June 30, 2024 / 04:07 PM IST

విధాత , హైదరాబాద్ : విద్యుత్తు బిల్లుల వసూళ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరిత నిర్ణయాలుతీసుకోబోతుందని, అందుకే పాతబస్తీలో విద్యుత్తు బిల్లుల వసూళ్ల ప్రక్రియను ఆదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విద్యుత్తు బిల్లుల వసూళ్ల బాధ్యతను పైలట్ ప్రాజెక్టుగా ఆదానీకి అప్పగించడం పాతబస్తీకే పరిమితం కాదని, రాష్ట్రం మొత్తం విద్యుత్తు బిల్లుల వసూలు క్రమంగా ఫ్రైవేటు చేతిలోకి వెళ్తుందనిజగదీశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు రంగాన్ని ప్రయివేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందనడానికి ఇది నిదర్శనమని, అదే జరిగితే విద్యుత్తు సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు ఇక రాష్ట్రంలో ఉండవని జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల విద్యుత్తు మోటార్లకు మీటర్లు పెడతారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చినా విద్యుత్తు రంగాన్ని ప్రయివేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి కేసీఆర్ అంగీకరించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానీ మోడీ కనుసన్నల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, మోదీ,అదానీ విధానాలను తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. విద్యుత్తు సంస్థ ప్రజల ఆస్తి అని, దీన్ని ప్రయివేటు వ్యక్తులకుఅప్పచెప్తున్నారని ఆరోపించారు. పాతబస్తీలో 45 శాతం మాత్రమే కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయని, అందుకే ప్రయివేటు వ్యక్తులకుఇస్తున్నామని రేవంత్ రెడ్డి అంటున్నారని, తెలంగాణలో 95 నుండి 97 శాతం వరకు కరెంటు బిల్లులు వసూలు అవుతున్నాయని, పాత బస్తీ ప్రజలను అవమానించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని విమర్శించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, పాతబస్తీలో 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు వచ్చే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యుత్తు బిల్లుల విషయమై చేసిన వ్యాఖ్యలపై విద్యుత్తు శాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రభుత్వం చార్జీల వసూల కోసం బౌన్సర్ లకు అప్పగిస్తుందా ?. రెవెన్యూ రికవరి కోసం గుండా గ్యాంగ్ లకు అప్పగిస్తారా ?, ప్రభుత్వం చేయలేని పని….ప్రైవేట్ వ్యక్తులు ఎలా చేస్తారు ?. ప్రజలను దొంగలు చేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుంది.” సంచలన వ్యాఖ్యాలు చేశారు.

సింగరేణికి నష్టం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సింగరేణి బొగ్గు గనులను వేలంతో కేంద్రంతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి నష్టం చేసే చర్యలకు పాల్పడిందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బొగ్గు గనుల వేలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని శ్రావనపల్లి బొగ్గు గనినివేలం నుండి ఎందుకు తీసివేయించలేదని నిలదీశారు. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదన్నారు. సింగరేణి బొగ్గు గనులను లీజుకు తీసుకున్న కంపెనీలను మేము అనుమతించమని బీఆరెస్‌ ఇప్పటికే అభిప్రాయం చెప్పిందని స్పష్టం చేశారు. విద్యుత్తు బిల్లుల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలిపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంగా వ్యవహరిస్తోందని, విద్యుత్తు ఉద్యోగులపాత్ర నామమాత్రంగా మారే అవకాశముందని, ప్రయివేటు వాళ్లకు అప్పగిస్తే విద్యుత్తు వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారని మండిపడ్డారు. ఒడిస్సాలో వరదలు వస్తే… అక్కడ విద్యుత్ రంగంలో ఉన్న ప్రైవేటు కంపెనీ ప్రజలను ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు.

Latest News