Site icon vidhaatha

Gutta Sukhender Reddy | బీఆరెస్ అవినీతితోనే కూలిన సుంకిశాల.. అనవసర పథకమన్న మండలి చైర్మన్ గుత్తా

విధాత, హైదరాబాద్ : గత బీఆరెస్ ప్రభుత్వ అవినీతే కారణంగానే సుంకిశాల ప్రాజెక్టు పంప్‌హౌజ్ వాల్ కూలిపోయింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూలిన సుంకిశాల పంప్‌హౌజ్ కూలిన రిటైనింగ్‌ వాల్‌ను, నీట మునిగిన ఇంటెక్‌ వెల్, పంపింగ్ స్టేషన్‌ను మంత్రులు పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిణామాలను, ప్రాజెక్టు వివరాలను జలమండలి, నీటి పారుదల శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ జరిగిన సంఘటన చిన్నదని నష్టం కూడా తక్కువేనని, ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ భరిస్తారని, ఇందులో ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని, నిర్మాణం పూర్తి కావడానికి ఒకటి, రెండు నెలలు పట్టేదని, ప్రస్తుత ఘటన కారణంగా నిర్మాణం ఆలస్యం కానుందని తెలిపారు. గత ప్రభుత్వం ఎస్‌ఎల్బీసీ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందని, దీనిని పూర్తి చేసి ఉంటే ఉమ్మడి నల్లగొండ సస్యశ్యామలమయ్యేదన్నారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ మూడేళ్లలోగా పూర్తి చేస్తుందన్నారు. డిండి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామన్నారు. సుంకిశాల పథకం పనులు బీఆరెస్ హయంలోనే జరిగినవేనని, అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆరెస్ నాయకులు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దక్షిణ తెలంగాణను బీఆరెస్ పదేళ్లలో నిర్లక్ష్యం చేసిందని, కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ ఈ ప్రాంత ప్రాజెక్టులపై పెట్టలేదని అగ్రహం వ్యక్తం చేశారు. సుంకిశాల కూలిన ఘటన సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి తెలిసిందని, వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. జలమండలి అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత వారితో చర్చించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రాజెక్టు కూలిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. జరిగిన నష్టాన్ని నిర్మాణ సంస్థే భరిస్తుందన్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఎల్బీసీ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులను చేపట్టడంతో గత ప్రభుత్వాలు సుంకిశాల పథకాన్ని పక్కన పెట్టాయని గుర్తు చేశారు. వాటితో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే అవకాశమున్నప్పటికి అవసరం లేకున్నా సుంకిశాల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీనికి కేటాయించిన 2వేల కోట్లతో ఎస్‌ఎల్బీసీ పూర్తయ్యేదని, గ్రావిటీతో సాగు,తాగు నీళ్లు వచ్చేవన్నారు. జంటనగరాలకు నీటి కొరత ఏర్పడితే ఎమర్జన్సీ మోటార్ల ప్రక్రియ సైతం అందుబాటులో ఉందన్నారు. అలాంటప్పుడు సుంకిశాల ప్రాజెక్టు ఎందుకు ప్రారంభించారో కేసీఆర్, కేటీఆర్‌కే తెలియాలని వ్యాఖ్యానించారు. ఇది కేసీఆర్ మానస పుత్రికనో లేక కేటీఆర్ మానస పుత్రికనో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. సుంకిశాల పథకం వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపైన, సీఎం రేవంత్‌రెడ్డిపైన కేటీఆర్ రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆరెస్ ప్రభుత్వమే సుంకిశాల పథకం మంచి చెడులకు బాధ్యత వహించాల్సివుంటుందన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరిగినంత వేగంగా కృష్ణా నది ప్రాజెక్టుల పనులు జరగడం లేదన్నారు.

Exit mobile version