రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి
విధాత, హైదరాబాద్ : సాగు ప్రోత్సాహానికి తెలుగు రైతుబడి డిజిటల్ మీడియా చేస్తున్న సేవలు ఆదర్శనీయమని, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను, యంత్రాలను పరిచయం చేసే విధంగా “రైతుబడి అగ్రి షో” నిర్వహించడం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రతీ రైతు ఈ “రైతుబడి అగ్రి షో”ను సద్వినియోగం చేసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న తెలుగు రైతుబడి మొదటి ఆగ్రీ ఎక్స్‌పోను మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలిసి గుత్తా ప్రారంభించారు. వ్యవసాయ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ, అనుబంధ రంగాల కంపనీల ఉత్పత్తుల స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గుత్తా మాట్లాడుతూ వ్యవసాయ ఎగ్జిబిషన్‌ల నిర్వాహణ ద్వారా రైతులకు నూతన ఆవిష్కరణలపైన, ఆధునిక, మేలైన సాగు పద్దతులపై అవగాహాన పెంపొందుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వాలకే స్ఫూర్తిదాయకంగా రైతుబడి ఎండీ జూలకంటి రాజేందర్‌రెడ్డి వ్యవసాయ ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. వ్యవసాయంలో కూలీల కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా నూతన టెక్నాలజీని ఉపయోగించుకొని రాబడి పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు వరినే కాకుండా పామాయిల్ వంటి వాణిజ్య పంటలను పండించాలని, ప్రతి సంవత్సరం దేశంలో 80 నుండి లక్ష కోట్ల రూపాయల విదేశీ మరకద్రవ్యాన్ని పామాయిల్ పై ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పూర్తయితే 4 లక్షలు ఎకరాలకు సాగునీరు వస్తుందని గుర్తు చేశారు.
సాగుకు సర్కార్ మద్దతు : మంత్రి తుమ్మల
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ సాగు పెట్టుబడులు తగ్గించి దిగుబడి పెంచుకున్నప్పుడే రైతుకు వ్యవసాయం లాభ సాటి అవుతుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీ మేరకు 2లక్షల రుణమాఫీని 18వేల కోట్లతో అమలు చేశామన్నారు. సాంకేతిక ఇబ్బందులున్న రైతులందరి రుణమాఫీ చేస్తామన్నారు. రేపటినుండి 2 లక్షలకు మించి వున్న మొత్తాన్ని రైతులు బ్యాంకులకు వెంటనే చెల్లించినట్లయితే రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. అలాంటి ఖాతాలు రాష్ట్ర వ్యాప్తంగా మరో 10 నుండి 12 వేలు ఉన్నట్లు తెలిపారు. రైతు రుణమాఫీలో భాగంగా నల్గొండ జిల్లాకే అత్యధికంగా 1433 కోట్ల రూపాయలను 1,72,785 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లాలో ఇదివరకే పామాయిల్ తోటల పెంపకం చేపట్టారని, ఇందుకుగాను తక్షణమే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఇవ్వాల్సిందిగా మంత్రి తుమ్మల జిల్లా కలెక్టర్‌ను కోరారు. జిల్లాలో బత్తాయి ఎక్కువగా సాగవుతున్న దృష్ట్యా ఇతర దేశాలకు బత్తాయిని ఎగుమతి చేసేందుకు హైదరాబాద్‌లోని ఫ్రూట్ మార్కెట్ సమీపంలో ఎగుమతి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో నూతన వరవడిని సృష్టించే విధంగా తెలంగాణ రైతాంగాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
అప్పులు లేని రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి వెంకట్‌రెడ్డి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాలలో ఎస్‌ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు. ఇటీవల బ్రాహ్మణ వెల్లెం ట్రయల్ రన్ ప్రారంభించామని, ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్ , ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువల పూర్తి చేయటం, అలాగే ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు . రైతుల సంక్షేమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేశామని అప్పులు లేని రైతులున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని చెప్పారు. తెలుగు రైతుబడి తమ మొదటి అగ్రీ ఎక్స్‌పోను నల్లగొండలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా రైతులకు ఫామ్ పాండ్స్ నిర్మాణం, విత్తనాలను అందజేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు రఘువీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, డీసీసీబీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డి, గుత్తా జితేందర్‌రెడ్డి, అమిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పాశం రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.