విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీల పరిస్థితి తలోదారి అన్నట్లుగా మారింది. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు చర్చలలో భాగంగా ఎట్టకేలకు కొత్తగూడెం సీటు, ఒక ఎమ్మెల్సీ స్థానంపై ఒప్పందం కుదిరింది. మునుగోడులో మాత్రం ఫ్రెండ్లీ పోటీ చేస్తామని సీపీఐ ప్రకటించింది. సీపీఎంకు కూడా ఖమ్మం జిల్లాలో ఒక సీటు ఇవ్వాలని తమ చర్చల్లో సీపీఐ ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్, సీపీఎం జాతీయ నాయకులు చర్చిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. దీంతో సీపీఎం సీటు కేటాయింపుపై స్పష్టత రాలేదు. ఇంకోవైపు కాంగ్రెస్‌తో పొత్తుపై ఆశలు పెట్టుకోకుండా సొంతంగా 17స్థానాల్లో పోటీకి అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో సీపీఎం నాయకత్వం కసరత్తు చేస్తుంది.
ఇక సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ మూడు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రకటించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ సూర్యాపేట, ఆశ్వారావుపేట, సత్తుపల్లిలో పోటీ చేస్తున్నామన్నారు. ఇల్లందులో గుమ్మడి అనురాధ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారని.. ఆమెకు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ ఒంటరిగా ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయనుందన్నారు. బీజేపీ దాని అనుబంధ పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎంలను ఒడించడమే తమ లక్ష్యమన్నారు. తాము పోటీ చేయని స్థానాల్లో కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని పోటు రంగారావు పేర్కోన్నారు.