నిన్నటి దాక ఎన్నికల పోరు.. మరుసటి రోజే ప్రజా పోరాటం

చౌటుప్పల్ మండలంలోని జై కేసారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు పడుతున్న రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా సీపీఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు.

  • Publish Date - May 14, 2024 / 07:07 PM IST

నిబద్ధతను చాటిన సీపీఎం అభ్యర్థి జహంగీర్

విధాత : భువనగిరి లోక్‌సభ స్థానం ఎన్నికల బరిలో నిలిచి పోలింగ్ ముగిసేదాకా ప్రత్యర్థి రాజకీయ పార్టీల అభ్యర్థులతో ప్రచార పర్వంలో పోరాడిన సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ ఎన్నికల ముగిసిన మరుసటి రోజునే తనదైన శైలీలో ప్రజా పోరాటాల్లో పాల్గొని ప్రజాసమస్యలపై తన నిబద్దత చాటుకున్నారు.

చౌటుప్పల్ మండలంలోని జై కేసారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు పడుతున్న రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా సీపీఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా 60వేల బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిందని, అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఫోన్‌లో జిల్లా కలెక్టర్‌, ఆర్డీవోలను సంప్రదించి రైతుల ధాన్యం కొనుగోలు సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. జిల్లా అంతటా కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, వర్షాకాలం సమీపిస్తుండటంతో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఇదే సమయంలో రైతులు ధాన్యం కొనుగోలు సమస్యలపై భువనగిరిలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం సమస్య తీవ్రతకు నిదర్శనమని పేర్కోన్నారు. ఇకనైనా అధికారులు మేల్కోని రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

 

Latest News