Crocodile | హైదరాబాద్ : హైదరాబాద్( Hyderabad ) నగరంలోని మూసీ( Musi ) పరివాహక ప్రాంతాల్లో మొసళ్ల( Crocodile ) బెడద ఎక్కువైపోయింది. రెండు రోజుల క్రితం కిషన్‌బాగ్( Kishanbagh ) వద్ద ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. మూసీ నది నుంచి రోడ్డు మీదకు మొసలి రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం నాడు ఓ మేకను మొసలి పట్టుకుని నదిలోకి లాక్కెళ్లినట్లు హసన్‌నగర్ వాసి తెలిపాడు. ఈ మొసలి సంచారంపై జూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని స్థానికులు పేర్కొన్నారు.
తాజాగా దిల్‌సుఖ్‌నగర్( Dilsukhnagar ) పరిధిలోని చైతన్యపురి( Chaitanyapuri ) వద్ద మూసీ నదిలో మరో మొసలి ప్రత్యక్షమైంది. దీంతో ఫణిగిరి కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో తన పిల్లలతో సంచరిస్తున్న కుక్కను, దాని పిల్లలను మొసలి నీటిలోకి లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం సమయంలో నదిలో ఉన్న శివాలయం వద్ద మొసలి సంచరిస్తుండగా స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం మొసలి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మూసీ వైపు వెళ్లాలంటేనే పిల్లలు, పెద్దలు వణికిపోతున్నారు.