విధాత : నదిలో స్నానం చేస్తున్న మహిళపై ఓ మొసలి ఆకస్మికంగా దాడి చేసి ఈడ్చుకెళ్లిన ఘటన ఒరిస్సాలోని జాజ్ పూర్ జిల్లా భింఝర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సౌదామిని మహాల(57) ఖరస్రోట నదిలో స్నానం చేస్తుండగా..ఓ మొసలి ఆమెపై ఆకస్మికంగా దాడి చేసి నీటీలోకి లాక్కెళ్లింది. నది ఒడ్డున ఉన్న గ్రామస్తులు ఈ సంఘటనను గమనించి మొసలి నుంచి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
మొసలి మహిళను నదిలోకి లాగుతున్నప్పుడు మేము గమనించి.. ఆమెను రక్షించడానికి నదిలోకి దూకినప్పటికి… మా ప్రయత్నాలు ఫలించలేదు అని ప్రత్యక్ష సాక్షి నబా కిషోర్ మహాలా తెలిపారు. ఈ సంఘటనసమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.