విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Medaram Jatara Updates | సమ్మక్క సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదనీ, ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడూ, ఆత్మ గౌరవ ప్రతీకగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో జాతర పనులను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు.
మేడారం జాతరను కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో పరిచయం చేయాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. మేడారం జాతర తెలంగాణ గుండె చప్పుడుగా, ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జాతర పర్యవేక్షణ కోసం రూ.150 కోట్లను విడుదల చేశామని, ఇందులో దేవాలయానికి మాత్రమే రూ.101 కోట్లను వెచ్చించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 251 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇందులో జాతర నిర్వహణ కోసం రూ. 150 కోట్లు శాశ్వతంగా గుడి నిర్మాణ పనులకు రూ. 101 కోట్లు వెచ్చిస్తున్నట్టు వివరించారు. జాతర పనులు 85శాతం పూర్తి చేశారు. మిగిలిన పనులు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు.
గతంలో జాతర నిర్వహణకు రూ. 75 కోట్లు, రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం రూ. 251 కోట్లు ఖర్చు చేస్తున్నదని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రధానంగా ఆరోగ్య, విద్యుత్, పంచాయతీ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని వీరితో పాటు యావత్ శాఖల సిబ్బంది అధికారులు జాతర ను సీరియస్ గా తీసుకోవాలని ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ మేడారం మహాజాతరను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, జిల్లా ఎస్పీ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు సి హెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ఆర్ అండ్ బి ఈ ఎన్ సి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
