- ఆలస్యంగా ప్రారంభించడంలో అంతర్యం?
- ప్రతీ జాతరకు ముందూ ఇదే తరహా వ్యవహారం
- సమయం దగ్గరపడుతున్నా పూర్తిగాని పనులు
- ప్రజాప్రతినిధులూ, కాంట్రాక్టర్లూ, అధికారుల మధ్య ‘ఐక్యత’
- పనుల ప్రారంభంలో మంత్రుల మధ్య విభేదాలు
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Medaram Updates | అదేంటో.. మేడారం జాతర ప్రతీ రెండేళ్ళకోసారి వస్తుందని అందరికీ తెలుసు. ఈ జాతరకు కోట్ల మంది భక్తులు హాజరవుతారని రాష్ట్ర ప్రభుత్వానికీ తెలుసు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజు మేడారం జాతర ప్రారంభమవుతుందని స్థానిక ములుగు అధికార యంత్రాంగానికెరుకే. ఈ జాతర నిర్వహణ తేదీలను ముందుగానే మేడారం వడ్డెలు (పూజారులు) ప్రకటించడం ఆనవాయితీగానే వస్తోంది. ఈసారీ ఆరునెలలకు ముందే ప్రకటించారు. ఇవే కాదు.. మేడారం జాతర గొప్పదనం, పెద్ద సంఖ్యలో హాజరయ్యే జనం.. విసృత ఏర్పాటు చేయాల్సిన అవసరం.. జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకూ ముందుగా తెలిసే విషయమే. ఎందుకంటే శతాబ్దాలుగా ఈ జాతర సాగుతున్నా.. దశాబ్దాలుగా ప్రభుత్వం ఈ జాతర నిర్వహణను భుజాలకెత్తుకుని అంతా తానై వ్యవహరిస్తున్నది.
గత కొన్నేళ్ళుగా జాతరకు రెండు, మూడు నెలల నుంచే భక్తుల రాక బాగా పెరుగుతున్నదనేదీ అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల నిత్యం ఎంతోకొంత మంది మేడారాన్ని దర్శించుకుంటున్న పరిస్థితి. మొత్తం అన్ని విషయాలు అందరికీ తెలిసినప్పటికీ జాతర ప్రారంభంనాటికి కూడా ఎందుకు పనులు పూర్తిచేయరనేది అందరి మదిలో తలెత్తుతున్న ప్రశ్న. జాతర పనులకు ప్రతిపాదనలు పంపడం, ఆమోదం తెలుపడం, నిధులు విడుదల ఇలా అన్నింటిలో జాప్యం చేసి.. తీరా జాతరకు రెండు, మూడు నెలల ముందు ప్రారంభించి జాతర నాటికి పనులు పూర్తయ్యాయనే తీరుగా వ్యవహరించడంలో మర్మమేమిటి? ఇందులో ఏదో మాంచి మతలబే ఉన్నందునే ‘షరామాములు’గా ఈ పనులు సా…గూ….తూ ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితిని మొత్తం చూసి.. ‘అంతా ఆ … మేడారంలో కొలువుదీరే సమ్మక్క, సాలరమ్మలకే ఎరుక’ అంటూ చమత్కరిస్తున్నారు’.
మేడారం జాతరకు కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు గొప్పగా ప్రకటించే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు… ఈసారి తామింత మొత్తంలో నిధులు సాధించామని చెప్పుకొనే మంత్రులు, ఎమ్మెల్యేలకు… ఆగమేఘాల మీద ఆపసోపాలు పడుతూ పనులు పూర్తిచేయించామని చెబుతూ పర్యవేక్షించే అధికార యంత్రాగానికి, ఆఖరికి ‘సకాలం’లో పనులు పూర్తిచేస్తామంటూ ప్రకటించే కాంట్రాక్టర్లకే ఈ జాప్యంలోని ‘గోప్యత’ తెలుసన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పేద, మధ్యతరగతి వర్గాలు హాజరు
- మేడారం జాతరంటేనే ఆదివాసీ, గిరిజన, గిరిజనేతర పేద, మధ్యతరగతి వర్గాల జాతర.
- ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఇతరుల రాక బాగా పెరిగినప్పటికీ అట్టడుగువర్గాలు హాజరయ్యే జాతర.
- ఈ జాతరలో జంపన్నవాగులో నీళ్ళు, తాగేందుకు మంచినీటి వసతి తప్ప మిగిలిన అవసరాలూ, వసతుల గురించి జాతరకు వచ్చే భక్తులు పెద్దగా పట్టించుకోరు.
- జాతర నిర్వహించే మేడారం ప్రాంతం అటవీప్రాంతం కావడంతో పచ్చనిచెట్లు, పొదలు, భారీ వృక్షాలు, వాగు, వంకలే జనానికి ఆశ్రయం కల్పిస్తాయి.
- గతంలో ఎడ్లబండ్లు, ఇప్పుడు వాహనాలను గుడారాలుగా మార్చుకుని, ఇంటిల్లిపాదీ ఆ నాలుగైదు రోజులు మేడారంలో గడిపి తమ ఇష్టదైవాలను కొలుచుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
- అందుకే ఇప్పుడు కాస్త తగ్గింది కానీ, కొన్నేండ్ల వరకు మేడారం జాతరకు వెళ్ళిన వారు ఎర్ర దుబ్బ లేకుండా, వాహనాలకు కూడా దుబ్బలేకుండా కనిపించేవారు కాదు.
- రోడ్డు వసతి పెరిగి, సౌకర్యాల కల్పనతో మేడారంలో వాతావరణం మారిపోయింది.
పారిశుధ్య సమస్య, మరుగుదొడ్ల ఏర్పాటు
మేడారం జాతరలో సవాల్ గా మారేది ప్రధానంగా పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, నీటి వసతి కల్పన. ఎందుకంటే కోట్లమంది భక్తులు తరలివచ్చే ఈ జాతర.. నిజానికి నాలుగు రోజులే నిర్వహిస్తున్నప్పటికీ ముందస్తు మొక్కులు, జాతర సమయంలో వచ్చే లక్షల మందికి మరుగుదొడ్ల వసతి ప్రధానమైంది. ఇదే ఇక్కడ పెద్ద సమస్యగా మారుతోంది. జాతరకు ముందు తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నప్పటికీ నిర్వహణ, పర్యవేక్షణ లోపంతో ప్రతి యేటా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి తోడు వనదేవతలకు మొక్కులో భాగంగా కోళ్ళ, మేకలు బలి ఇస్తారు. వీటి వ్యర్ధాలు కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయి. దీంతో జాతర తర్వాత మేడారం పరిసరాల్లో భయానకమైన అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది. స్థానికులకు తీవ్ర ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
అత్తెసరు పనులు ….ఆగమాగంగా పూర్తి
జాతరకు కొద్ది రోజుల ముందు పనులు ప్రారంభించి జాతరనాటికి కూడా కొనసాగించడంలో పనుల నాణ్యత ప్రశ్నార్ధకంగా మారుతోందని భక్తులు అంటున్నారు. భక్తుల కోసం ఏదో త్యాగం చేసినట్లుగా జాతర నాటికి ఆగమేఘాల మీద పనులు పూర్తి చేయడంతో ఆ జాతర నాలుగు రోజులుంటే చాలనే పరిస్థితి నెలకొంటోంది. తీరా జాతర నాటికి పనులు సగం పూర్తయ్యి పూర్తిగాక పోవడంతో నాణ్యతను ప్రశ్నించే పరిస్థితి అవకాశం ఆ సమయంలో లేకుండా పోతోంది. బిల్లులు పొందడంలో మాత్రం వంద శాతం తీసుకుంటూ ఎవరివాటా వారు పంచుకోవడానికే ఈ పనులు ఆలస్యంగా మొదలు పెట్టి.. ఆలస్యంగా ముగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరుగుదొడ్లు, మంచి నీటి వసతి, స్నానానికి ఏర్పాట్లు, స్థానిక రోడ్లు వంటి కొన్ని పనులు.. పూర్తయ్యాయా? లేవా? అనే సందేహాలూ నెలకొంటున్నాయి. దీంతో ఎవరికి వారు జాతర పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసినందునే ఇదో పద్ధతిగా సాగుతోందంటున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులూ, కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య ‘ఐక్యత’ కొనసాగుతోందని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే జాతర పనులు ప్రారంభానికి ముందు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి మధ్య పొసగక పొరపొచ్చాలొచ్చాయనే వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత సర్ధుబాటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఈసారి శాశ్వత ఏర్పాట్లు… అయినా జాప్యమే!
మేడారానికి జాతర సమయంలో భక్తుల రాక పెరిగింది. జాతర లేని సమయంలో.. ఏడాది పొడవునా భక్తులు మేడారాన్ని సందర్శించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తుల అవసరాలు తీర్చేందుకు శాశ్వత ఏర్పాట్ల వైపు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదికూడా కేవలం వంద రోజుల లక్ష్యంగా పనులను ప్రారంభించారు.
- గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రధానమైన పనులు పూర్తయ్యాయంటూ ఈ నెల 19వ తేదీన ప్రారంభించారు.
- ఈ సారి మేడారం గద్దెలు, ప్రాంగణం పునురుద్దరణ చేపట్టినప్పటికీ ఈ మాస్టర్ ప్లాన్ ఆమోదించడంలో జాప్యం జరిగింది.
- ఈ కారణంగా కేవలం వంద రోజులు లక్ష్యంగా పనులు చేపట్టారు.
- వాస్తవానికి జాతరకు రెండు నెలల ముందు నుంచే భక్తులు ముందస్తు మొక్కులు సమర్పించేందుకు వస్తారని తెలుసు.
- ఈ మేరకు భక్తులు వస్తున్నారు కూడా. దీంతో ఒక వైపు పనులు, మరో వైపు భక్తుల రాకతో ఇబ్బందులు తప్పలేదు.
- మధ్యలో మంత్రుల పర్యటనల పేరుతో, కొన్ని సందర్భాల్లో అనవసర సమీక్షలు నిర్వహిస్తూ కాలయాపన చేశారనే విమర్శలున్నాయి.
వంద రోజుల లక్ష్యం పూర్తయినప్పటికీ ఇంకా జాతరలో అనేక పనులు ఇంకా కొనసాగుతున్నాయి. జాతర ప్రాంగణం, గద్దెల పునర్నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా మెరుగులు దిద్దే పనులు సాగుతున్నాయి. ఇక వసతులు, సౌకర్యాలకు సంబంధించి పనులింకా సాగుతున్నాయి. రోడ్ల పనులు, ఇతరత్రా వసతులు సమకూర్చే పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నిమగ్నమయ్యారు. తాత్కాలిక పనులు పక్కనపెడితే శాశ్వత నిర్మాణాలైనా ముందుగా ప్రారంభించి చేపడితే ఈ సమస్యలు ఉత్పన్నమయ్యేదికాదంటున్నారు స్థానికులు, పరిశీలకులు. నాణ్యతాప్రమాణాలతో పనులు పూర్తిచేయడమేకాకుండా, సకాలంలో పూర్తయ్యి…భక్తులకు ఉపయోగపడేవంటున్నారు. జాతర ప్రారంభానికి నాలుగు రోజులే మిగిలున్నాయి. ఇంకా కొన్ని పనులు పూర్తికాలేదు. వచ్చే జాతర పనులైనా ముందుగా చేపట్టి, ముందుగా పూర్తి చేస్తే ప్రజా ధనం సద్వినియోగం కావడమే కాకుండా భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also |
Telangana Municipal Elections | తెలంగాణ మునిసిపల్ రిజర్వేషన్ల మాయాజాలం.. పోటీకి వస్తారని తెలిసి ముందే తప్పించారా?
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు మీకు తెలుసా?
Medaram Jatara Rare Photos | దట్టమైన అరణ్యమే ఆలయం, ప్రకృతే దేవత!.. హంగులులేని 50 యేళ్ళ నాటి మేడారం జాతర
