తెలంగాణలో దసరా సందర్భంగా రెండు రోజుల పాటు రూ. 419 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ ప్రజలు దసరాను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సారి దసరా గాంధీ జయంతి రోజున వచ్చింది. గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు బంద్. అయినా కూడా మద్యం విక్రయాలు మాత్రం తగ్గలేదు. దసరా పండుగ నేపథ్యంలో ఒక్క రోజు ముందే మందు ప్రియులు లిక్కర్ కొనుగోలు చేశారు. మద్యం దుకాణాల వద్ద గాంధీ జయంతి రోజున లిక్కర్ దుకాణాలకు సెలవు అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ముందుజాగ్రత్తగా ఒక్క రోజు ముందే మద్యం కొనుగోలు చేశారు. ఇక మాంసాన్ని కూడా ఒక్క రోజు ముందే కొనుగోలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగాయి. సెప్టెంబర్ 30న రూ. 333 కోట్లు, అక్టోబర్ 1న, 86 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకొని సెప్టెంబర్ 26 నుంచి లిక్కర్ సేల్స్ పెరిగాయి. సెప్టెంబర్ 29న 278.66 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇక సెప్టెంబర్ మాసంలో రూ.2,715 కోట్ల ఆదాయం వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు 26.71 లక్షల లిక్కర్ కేసులు, 33.24 లక్షల బీర్ల కేసులు అమ్ముడయ్యాయి. 2023 దసరా పండుగ 9 రోజుల్లో రూ.1,057 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇక 2024లో దసరా సందర్భంగా రూ. 1,100 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కేవలం 10 రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 11 వరకు 10.44 లక్షల మద్యం కేసులు, 17.59 లక్షల కేసుల బీర్లు విక్రయించారు. దీని విలువ రూ. 1100 కోట్లు. మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి టాప్ లో నిలిచింది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలు వరుస స్థానాల్లో నిలిచాయి.